నియోజకవర్గానికి 2 వేల ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

నియోజకవర్గానికి 2 వేల ఇళ్లు

Jun 7 2026 9:30 AM | Updated on Jun 7 2026 9:30 AM

సాక్షి, సిద్దిపేట: ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ పూరి గుడిసెల్లో నివసిస్తున్న పేదలు త్వరలో కొత్త ఇంటిలోకి అడుగుపెట్టనున్నారు. వారికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని నిర్ణయించింది. ప్రస్తుతం మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం నడుస్తుండగానే.. 2026–27 ఏడాదికి సంబంధించి రెండో విడత ఇళ్లను మంజూరు చేసింది. అయితే ప్రాధాన్యత క్రమంలో ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించగా, వీటిలో మొదటగా గుడిసెల్లో ఉండి, నిబంధనల ప్రకారం అర్హులుగా ఉన్న వారికి మంజూరు చేయనున్నారు. మొదటి విడతలో జిల్లావ్యాప్తంగా 10,898 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో ముగ్గులు పోసి 10,120 గృహాలను ప్రారంభించగా, ఇప్పటివరకు 2,068 నివాసాలు పూర్తయ్యాయి. పలువురు గృహ ప్రవేశాలు సైతం చేశారు. రెండో విడతలో జిల్లాకు దాదాపు మరో 8 వేల ఇళ్లు మంజూరు కానున్నాయి.

వారికి 500 ఇళ్ల చొప్పున..

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి 2 వేల ఇళ్ల చొప్పున మంజూరు చేయాలని నిర్ణయించారు. అందులో తొలి విడతలో ప్రత్యేకంగా గుడిసెల్లో నివసిస్తున్న వారికి 500 ఇళ్ల చొప్పున మంజూరు చేయనున్నారు. ఇప్పటికే పలువురిని గుర్తించి అవతరణ దినోత్సవం సందర్భంగా పలువురికి మంజూరు పత్రాలను అందజేశారు. దీంతో గుడిసెలు కాస్తా బంగ్లాలుగా మారనున్నాయి.

గతంలో నిలిచిన ఇళ్లకు సాయం

గత ప్రభుత్వంలో మంజూరు చేసిన గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు సైతం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నారు. గోడలు, స్లాబుల దశలో నిలిచిపోయిన ఇళ్లకు రూ.2 లక్షల వరకు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇళ్ల కోసం రాజకీయ నాయకుల వద్దకు లబ్ధిదారులు క్యూ కడుతున్నారు. ఇళ్లు మంజూరు చేయాలని కోరుతున్నారు.

రెండో విడతలో మంజూరు

గుడిసెలో నివసిస్తున్న వారికి ప్రాధాన్యం

ఇప్పటికే పలువురికి మంజూరు పత్రాలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement