భూముల విలువ డబుల్‌ | - | Sakshi
Sakshi News home page

భూముల విలువ డబుల్‌

Jun 6 2026 9:13 AM | Updated on Jun 6 2026 9:13 AM

భూముల విలువ డబుల్‌

గజం ధర రూ.28,800 శివార్లలో రూ.300 నుంచి రూ.600 పెంపు పెరిగిన అపార్ట్‌మెంట్ల విలువ అమల్లోకి పెరిగిన స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌ మార్కెట్‌ విలువ

పెంపు సరికాదు..

గజ్వేల్‌: రియల్‌ఎస్టేట్‌ రంగం కుప్పకూలిన తరుణంలో భూముల రిజిస్ట్రేషన్‌ విలువలను ఇష్టానుసారంగా పెంచడం సరికాదని ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. శుక్రవారం గజ్వేల్‌లో విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి పాలనలో రియల్‌ఎస్టేట్‌కు గడ్డు రోజులు సంక్రమించాయన్నారు. ఇలాంటి తరుణంలో భూముల విలువలను పెంచడం ఇబ్బందేనన్నారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం నిర్లక్ష్యాన్ని చాటుకుంటున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ చందన, వైస్‌ చైర్మన్‌ పద్మబాయి నర్సింగరావు, బీఆర్‌ఎస్‌ గజ్వేల్‌ పట్ట పట్టణ శాఖ అధ్యక్షుడు నవాజ్‌మీరా, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

సాక్షి, సిద్దిపేట: భూముల విలువలు డబుల్‌ అయ్యాయి. సిద్దిపేట పట్టణంలోని బస్టాండ్‌ ఏరియా, సుభాష్‌ రోడ్‌లలో నివాస స్థలాల మార్కెట్‌ విలువ అత్యధికంగా పెరిగింది. ఈ ప్రాంతంలో ఇది వరకు గజం మార్కెట్‌ విలువ రూ.23వేలు ఉండగా ప్రస్తుతం రూ.28,800 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూమి మార్కెట్‌ విలువలను ప్రభుత్వం పెంచింది. మార్కెట్‌ ధరల పెంపు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. పట్టణ శివారుల్లో గజం రూ.300 ఉండగా దానిని ఇప్పుడు రూ.600 పెంచారు. జిల్లా వ్యాప్తంగా 30శాతం నుంచి 150శాతం వరకు ధరలు పెంచారు. ఈ నెల 4వ తేదీ వరకు కిటకిటలాడిన రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు ఒక్కసారిగా శుక్రవారం సందడి తగ్గిపోయింది.

గజ్వేల్‌లో...

గజ్వేల్‌లో అత్యధికంగా గజం భూమికి మార్కెట్‌ విలువను రూ.10,800 నుంచి రూ.16,200కు పెంచారు. ఇందిరమ్మ విగ్రహం నుంచి పాత కూరగాయల మర్కెట్‌ రోడ్‌, ప్రజ్ఞాపూర్‌ రోడ్‌, హైదరాబాద్‌ రోడ్‌లలో అత్యధికంగా భూమి విలువ పెరిగింది. వాస్తవంగా ప్రధాన రహదారుల్లో గజం భూమి రూ.40వేలకు పైగా పలుకుతోంది.

హుస్నాబాద్‌లో

హుస్నాబాద్‌లో అత్యధికంగా గజం భూమికి రూ.8,800 నుంచి రూ.11వేలుగా ప్రభుత్వ నిర్ణయించింది. హుస్నాబాద్‌ నుంచి సిద్దిపేట, హన్మకొండ మెయిన్‌ రోడ్‌లలో అక్కన్నపేట, కరీంనగర్‌ రోడ్‌లలో అత్యధికంగా ధరలు ఉన్నాయి. మెదక్‌ నుంచి ఎల్కతుర్తి వరకు జాతీయ రహదారిలో హుస్నాబాద్‌ ఉండటంతో ధరలు బారీగా పెరిగాయి. అలాగే హుస్నాబాద్‌ పట్టణం అభివృద్ధి చెందుతుండటంతో సాధారణంగా భూముల ధరలకు రెక్కలు వస్తున్నాయి.

చేర్యాలలో..

చేర్యాల సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం పరిధిలో అత్యధికంగా రూ.8,700 ధరగా నిర్ణయించారు. నేతాజీ జంక్షన్‌, మైసమ్మ రోడ్‌, జెండా బజార్‌, కనకదుర్గ పెట్రోల్‌ పంప్‌, గుంటూరుపల్లి, గాంధీ చౌరస్తాలలో గతంలో గజం మార్కెట్‌ విలువ రూ.5,800 ఉండేది ప్రస్తుతం దానిని రూ. 8,700 పెంచారు.

దుబ్బాకలో ..

దుబ్బాక పట్టణంలోని పలు చోట్ల గజం భూమికి మార్కెట్‌ ధర రూ.5,400 నుంచి రూ. 8,100 పెరిగింది. దుబ్బాక లోని మెయిన్‌ రోడ్‌, తెలంగాణ తల్లి విగ్రహం, మున్సిపల్‌ కార్యాలయం ఏరియాలలో అత్యధికంగా ఽమార్కెట్‌ ధరలున్నాయి.

అపార్ట్‌మెంట్లలో ఇలా...

అపార్ట్‌మెంట్లలో గతంలో అంతస్తును బట్టి స్క్వేర్‌ ఫీట్‌కు మార్కెట్‌ విలువ ఉండేది. ప్రస్తుతం ఈ నిబంధనలు తొలగించి అపార్ట్‌మెంట్లలో ఏ అంతస్తుకై నా ఒకే ధరగా నిర్ణయించారు. సిద్దిపేటలో రూ.1,800, గజ్వేల్‌లో రూ.1,500 నుంచి రూ. 2,200, హుస్నాబాద్‌లో రూ.1,500 నుంచి రూ.2,200, దుబ్బాకలో రూ. 1,500, చేర్యాలలో రూ.1,300 నుంచి రూ.1,700లుగా ధర నిర్ణయించారు. ఇప్పటికే భూముల కొనుగోళ్లు అంతంతమాత్రంగా కొనసాగుతుండగా భూముల మార్కెట్‌ విలువ పెంపుతో మరింత తగ్గిపోయే అవకాశం ఉంటుందని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వాపోతున్నారు.

జిల్లా కేంద్రంలో అత్యధికం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement