వైద్యుల బదిలీలు పారదర్శకంగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

వైద్యుల బదిలీలు పారదర్శకంగా చేపట్టాలి

Jun 6 2026 9:13 AM | Updated on Jun 6 2026 9:13 AM

సిద్దిపేటకమాన్‌: ప్రభుత్వ వైద్యుల బదిలీలను పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ చందర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు ఓపీ సేవలు నిలిపివేసి నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్‌ చందర్‌ మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించడమేకాక తమకు సరైన ఆప్షన్స్‌ ఇవ్వడం లేదని వాపోయారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి జీవో 38 ప్రకారం బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలన్నారు. లేని పక్షంలో ఓపీ సేవలతో పాటు అత్యవసర సేవలు కూడా నిలిపివేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైద్యుల అసోసియేషన్‌ నాయకులు వినోద్‌బాబ్జి, మనోహర్‌, శ్రీనివాస్‌, హేమరాజ్‌సింగ్‌, సదానందం, వేణుగోపాల్‌చారి, శృతి తదితరులు పాల్గొన్నారు.

పవన్‌ కల్యాణ్‌

దిష్టి బొమ్మ దహనం

హుస్నాబాద్‌: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తెలంగాణ ద్రోహి అని హుస్నాబాద్‌ నియోజకవర్గ జేఏసీ కన్వీనర్‌ కవ్వ లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో పవన్‌ కల్యాణ్‌ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీమాంధ్ర పెట్టుబడుదారుల ఆటలు సాగనివ్వబోమని అన్నారు. కార్యక్రమంలో జేఏసీ కో కన్వీనర్లు మేకల వీరన్న యాదవ్‌, డ్యాగల సారయ్య, వివిధ పార్టీల నాయకులు గడిపే మల్లేశ్‌, గాదెపాక రవీందర్‌, కొయ్యడ కొమురయ్య, లక్ష్మణ్‌ గౌడ్‌, నాంపల్లి సమ్మయ్య, తొందూరి ఎల్లయ్య తదితరులు ఉన్నారు.

పంచాయతీ కార్యదర్శులకు

ఇన్‌చార్జి ఎంపీఓ బాధ్యతలు

సిద్దిపేటరూరల్‌: జిల్లాలోని గ్రేడ్‌ 1 పంచాయతీ కార్యదర్శులకు ఇన్‌చార్జి ఎంపీఓగా బాధ్యతలు అప్పగిస్తూ శుక్రవారం కలెక్టర్‌ కె. హైమావతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సిద్దిపేటఅర్బన్‌ మండలం పాండవపురం పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ఎల్‌.బాలాజీ ఇన్‌చార్జీ ఎంపీఓగా అక్బర్‌పేట భూంపల్లికి, కొండపాక మండలం, దుద్దెడ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ఎం.శోభ చిన్నకోడూరు మండల ఇన్‌చార్జీ ఎంపీఓగా బాధ్యతలు అప్పించారు. అలాగే చిన్నకోడూరు ఇన్‌చార్జి ఎంపీఓగా పనిచేస్తున్న డి.శ్రీనివాస్‌రావు నారాయణరావుపేట మండల ఎంపీఓగా, సిద్దిపేట రూరల్‌ మండలం చిన్నగుండవెల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లును మద్దూరు మండల ఇన్‌చార్జి ఎంపీఓగా, మిరుదొడ్డి మండల ఎంపీఓ అక్బర్‌పేట భూంపల్లి ఎంపీఓగా బదిలీ అయ్యారు. కాసులాబాద్‌ పంచాయతీ కార్యదర్శి ఫహీమ్‌ను ఇన్‌చార్జీ మిరుదొడ్డి ఎంపీఓగా పదోన్నతి కల్పించారు. రాయపోల్‌ ఎంపీఓ సీహెచ్‌. శ్రీనివాస్‌రెడ్డి ఇన్‌చార్జి ఎంపీఓగా, ములుగు ఇన్‌చార్జీ ఎంపీఓగా కె. నరేందర్‌రెడ్డిని, సిద్దిపేట అర్బన్‌ మండలం మిట్టపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి జి. మోహన్‌ను ఇన్‌చార్జి ఎంపీఓగా ధూల్‌మిట్ట మండలానికి బదిలీ అయ్యారు. సిద్దిపేట అర్బన్‌ మండలం వెల్కటూర్‌ పంచాయతీ కార్యదర్శి ఎం. విష్ణువర్ధన్‌ తోగుట మండల ఇన్‌చార్జి ఎంపీఓగా బదిలీ చేశారు. ఈ మేరకు కలెక్టర్‌ ఆదేశాల మేరకు వెంటనే విధుల్లో చేరనున్నారు.

కురుమల సంఘం రాష్ట్ర

యూత్‌ కార్యదర్శిగా రాజు

దుబ్బాకటౌన్‌: కుమ్మరుల సంఘం రాష్ట్ర యూత్‌ కార్యదర్శిగా రాయపోల్‌ ఉపసర్పంచ్‌ హన్మంతు రాజును నియమిస్తూ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ సారంగపాణి, కన్వీనర్‌ యాదగిరి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర వ్యవస్థాపకుడు ఆకారం మోహన్‌కు రాజు కృతజ్ఞతలు తెలిపారు. కురుమల సమస్యలపై పోరాడతానని చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement