మాట్లాడుతున్న కలెక్టర్ హైమావతి
● కలెక్టర్ హైమావతి ● అధికారులకు దిశా నిర్దేశం
సిద్దిపేటరూరల్: బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభు త్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెంచాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. బడిబాట కార్యక్రమంపై సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 20 వరకు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో 8,500 విద్యార్థులను చేర్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ సభ్యులు, యువత, గ్రామస్తులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలన్నారు. మూతపడిన 61 ప్రభుత్వ పాఠశాలలను మళ్లీ తెరిపించేలా విద్యార్థుల తల్లిదండ్రులను చైతన్యం చేయాలన్నారు. పాఠశాలలు పునఃప్రారంభైన వెంటనే పాఠ్యపుస్తకాలను అందించాలన్నారు. జిల్లాలో గల 34 భవిత కేంద్రాలలో 296 మంది ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు ఉండగా శుక్రవారం ప్రత్యేక డ్రైవ్ ద్వారా మరో 63 మంది విద్యార్థులను గుర్తించామన్నారు. పాఠశాలల్లో చేపట్టిన నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలన్నారు. ఇంటర్ విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం ప్రభుత్వం ప్రవేశపెడుతుండటంతో ఇంటర్ విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ వరగంటి శాస్త్రి, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి హమీద్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి సయ్యద్ రఫీక్ పాల్గొన్నారు.
వాణిజ్య పంటల సాగు వైపు మళ్లించండి
రైతులు వరి కాకుండా వాణిజ్య పంటల సాగు వైపు మళ్లించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో జూమ్ సమావేశం ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీసారి వరి సాగు చేయడం ద్వారా భూమిలోని సారం తగ్గిపోతుందని, పంట మార్పిడి వైపు ప్రతీ రైతు ఆలోచన చేయాలన్నారు. వాణిజ్య పంటలు, చిరుధాన్యాలు, ఆయిల్‌పాం సాగు వైపు సాగేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. విత్తనాల పంపిణీ కేంద్రాల్లో 50శాతం సన్నవడ్లు అమ్మేలా చూడాలని, సన్నవడ్ల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్నారు.
పంట అవశేషాలు కాల్చొద్దు
సిద్దిపేటరూరల్: పొలాల్లో పంట అవశేషాలు కాల్చవద్దని, అనేక నష్టాలు వస్తాయని కలెక్టర్ హైమావతి రైతులకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో 3 లక్షల 65 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం, 50 వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేశామన్నారు. ఈ పంటలు కోసిన తర్వాత పంట అవశేషాలను కాల్చడం వల్ల నేలలోని సేంద్రియ పదార్థాలు, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశిస్తాయన్నారు. గాలి కాలుష్యం పెరిగి ఆరోగ్య సమస్యలు వస్తాయని, కార్బన్ డైఆకై ్సడ్ వంటి హానికర వాయువులు విడుదల అవుతాయన్నారు. నేలలో సారం తగ్గుతుందన్నారు. అవశేషాలను కంపోస్ట్‌గా మార్చాలన్నారు.


