సిద్దిపేట కమిషనర్ సస్పెన్షన్
ఉత్తర్వులు జారీ చేసిన సీడీఎంఏ శ్రీదేవి
సిద్దిపేటజోన్: స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ కమిషనర్ ఆశ్రిత్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ గురువారం సీడీఎంఏ శ్రీదేవీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లలో వైఫల్యం, విధి నిర్వహణలో నిర్లక్ష్యం, తదితర అంశాలపై కలెక్టర్ హైమావతి ఈనెల 3న రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ శ్రీదేవికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన సీడీఎంఏ శ్రీదేవి తెలంగాణ సివిల్ సర్వీసెస్ నిబంధనల మేరకు ఆశ్రిత్‌కుమార్‌ను సస్పెన్షన్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
సాక్షి, సిద్దిపేట: జిల్లా అధికారుల్లో వణుకు మొదలైంది. రాష్ట్ర అవతరణ వేడుకల వేళ నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు ప్రారంభమయ్యాయి. వేడుకల సందర్భంగా ఏర్పాట్లు, స్టాల్స్, లబ్ధిదారులను తరలించకపోవడం.. సమీకృత కలెక్టరేట్‌లో జరిగిన వేడుకలకు గైర్హాజరైన 25 మంది అధికారులకు కలెక్టర్ హైమావతి షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నోటీసులు అందుకున్న అధికారులు 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. దీంతో అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్‌కు అధికారులు వివరణ ఇచ్చారు. వాటిని కలెక్టర్ పరిశీలించి ఆయా శాఖల కమిషనర్లకు లేఖలు రాస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కొందరు అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. ఈ చర్యల్లో భాగంగా సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్‌ను మున్సిపల్ శాఖ సస్పెండ్ చేసింది. దీంతో నోటీసులు అందుకున్న జిల్లా అధికారులు ఆందోళన చెందుతున్నారు. తమపై చర్యలు తీసుకుంటారా? అని ఆయా శాఖల అధికారులు.. ఉన్నతాధికారుల కార్యాలయాల్లో ఆరా తీస్తున్నట్లు సమాచారం. కఠిన చర్యలు తీసుకుంటేనే విధులు నిబద్ధతతో నిర్వర్తిస్తారని ప్రజలు, పలువురు అధికారులు అభిప్రాయ పడుతున్నారు.
మరో 150 మందికి నోటీసులు
రాష్ట్ర అవతరణ వేడుకలకు గైరాజరైన మరో 150 మంది వివిధ శాఖల ఉద్యోగులు, సిబ్బందికి కలెక్టర్ శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీరంతా 24 గంటల్లోగా ఆయా శాఖల జిల్లా అధికారుల ద్వారా జిల్లా కలెక్టర్‌కు వివరణ పంపించాల్సి ఉంటుంది. ఒకే సారి ఇంత మంది ఉద్యోగులకు నోటీసులు జారీ కావడంతో ఆందోళన చెందుతున్నారు.
షోకాజ్‌నోటీసులు
అందుకున్నవారిలో ఆందోళన
చర్యలు ప్రారంభించిన కలెక్టర్ హైమావతి


