● అందరూ మొక్కలు నాటాలి, సంరక్షించాలి ● మంత్రి పొన్నం ప్రభాకర్
కొండపాక(గజ్వేల్): పర్యావరణ పరిరక్షణతోనే ఆరోగ్యవంతమైన జీవితం ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మండలంలోని మర్పడ్గ శివారులోని ఆక్సీజన్ పార్కులో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంపీ రఘనందన్‌రావుతో కలిసి శుక్రవారం మొక్కలు నాటా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో 280 మహిళా సంఘాలకు 13 రకాల వస్తువులను గవర్నర్ చేతుల మీదుగా స్టీల్ బ్యాంక్ పంపిణీ చేశామన్నారు. 500 హోటళ్లలో స్టీల్ గ్లాసులు అందజేశామన్నారు. గ్రామాల్లో కోతుల బెడద తగ్గించేందుకు రోడ్ల వెంబడి వివిధ రకాల పండ్ల మొక్కలను నాటించామన్నారు. అలాగే గీత కార్మికుల భృతి కోసం ప్రభుత్వ స్థలాల్లో ఈత, తాటి మొక్కలను నాటడం జరుగుతోందన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపడతామన్నారు.
ప్లాస్టిక్‌తో క్యాన్సర్ ముప్పు..
ఎంపీ రఘనందన్‌రావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలన్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని అన్నారు. పెరుగుతున్న జనాభాను అనుగుణంగా విరివిగా చెట్లను పెంచుకోవాలన్నారు. మెదక్ నుంచి ఎల్కతుర్తి వరకు ఉన్న జాతీయ రహదారికి ఇరువైపులా లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టనుందని ఎంపీ తెలిపారు. అందులో భాగంగాగే భూంపల్లి అక్బర్‌పేట క్రాస్ రోడ్డు నుంచి సిద్దిపేట వరకు జాతీయ రహదారికి ఇరువైపులా ఒకేరోజు 20 వేల మొక్కలు నాటేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్నారు. కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ పర్యావరణం దెబ్బతినకుండా 33 శాతం పచ్చదనం ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రకృతి సిద్ధమైన ఎరువుల వాడకంతో భూసారం దెబ్బతినకుండా ఉంటుందన్నారు.అనంతరం పర్యావరణాన్ని కాపడుదామంటూ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సీపీ రష్మీ పెరుమాళ్, జిల్లా అటవీశాఖ అధికారి సంధ్యారాణి, అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్, అదనపు డీసీపీ సుబాస్ చంద్రబోస్, ఆర్డీఓ చంద్రకళ, తహసీల్దార్ మల్లికార్జున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


