కొనుగోళ్ల జాప్యంపై రైతుల కన్నెర్ర | - | Sakshi
Sakshi News home page

కొనుగోళ్ల జాప్యంపై రైతుల కన్నెర్ర

Jun 5 2026 10:21 AM | Updated on Jun 5 2026 10:21 AM

జిల్లాలో పలుచోట్ల ఆందోళనలు

రహదారులపై బైఠాయించి నిరసనలు

దుబ్బాక: ధాన్యం కొనాలంటూ రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం సైతం జిల్లాలో పలుచోట్ల రహదారులపై బైఠాయించి ఆందోళనలు చేపట్టారు. దుబ్బాక మున్సిపల్‌ పరిధిలోని చేర్వాపూర్‌కు చెందిన రైతులు ఆందోళనకు దిగారు. దుబ్బాక–సిద్దిపేట ప్రధాన రహాదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. కొందరు రైతులు రోడ్డుపైనే పడుకొని వడ్లు కొనేదాక లేచిది లేదంటూ నిరసన తెలిపారు. నెలల తరబడి పడిగాపులు కాస్తున్నా కాంటా పెడ్తలేరని, వానలు పడతున్నాయని తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ కీర్తి రాజు వెంటనే అక్కడికి చేరుకొని రైతులను సముదాయించి ఆందోళన విరమింపజేశారు. రైతుల ఆందోళనతో రోడ్డు కిరువైపులా పెద్దఎత్తున ట్రాఫిక్‌ స్తంభించింది.

గజ్వేల్‌–చేగుంట ప్రధాన రహదారిపై ..

దుబ్బాకటౌన్‌: రాయపోల్‌ మండల పరిధిలోని అంకిరెడ్డిపల్లి, వీరనగర్‌ గ్రామాలకు చెందిన రైతులు గురువారం రోజూ ఆందోళనకు దిగారు. గజ్వేల్‌–చేగుంట ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఇప్పటికీ ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న రాయపోల్‌ ఎస్‌ఐ మానస ఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినా వారు వినలేదు. అనంతరం తొగుట సీఐ లతీఫ్‌ రైతుల వద్దకు చేరుకుని సాయంత్రంలోగా ఐకేపీ కొనుగోలు కేంద్రానికి లారీలను పంపించి ధాన్యం తరలింపు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. ఈ ఆందోళనతో గంటల తరబడి గజ్వేల్‌–చేగుంట రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

వడ్లు దిగుమతి చేసుకోండి సారూ..

నంగునూరు(సిద్దిపేట): తూకం వేసిన వడ్ల బస్తాలను మిల్లర్లు దింపుకోవడంలో తీవ్ర జాప్యం చేస్తుండటంతో ఘణపూర్‌ రైతులు ట్రాక్టర్లతో తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చి నిరసన తెలిపారు. సమస్య పరిష్కారం కోసం ఫోన్‌ చేసిన తహసీల్దార్‌కు బస్తాకు 44 కిలోల తూకం వేస్తే కొంటామని సమాధానం ఇవ్వడంతో రైతులు అవాక్కయ్యారు. రైతులు స్థానిక కొనుగోలు కేంద్రంలో వడ్లను అమ్మి ట్రాక్టర్‌లో లోడ్‌ చేసుకొని గట్లమల్యాల లోని గోదాంకు తీసుకొచ్చారు. వారు దిగుమతికి నిరాకరించడంతో అధికారులు, నిర్వాహకులకు ఫోన్‌ చేసినా స్పందించలేదు. ఎక్కడ దిగుమతి చేయాలో తెలియక ట్రాక్టర్లతో వచ్చి నంగునూరు తహసీల్దార్‌ ప్రవీణ్‌రెడ్డికి మొర పెట్టుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు చేయాలని మిల్లర్‌కు తహసీల్దార్‌ చెప్పినా వినకపోవడంతో గట్లమల్యాల గిడ్డంగిలో దిగుమతి చేసుకోవాలని నిర్వాహకులను ఆదేశించి అక్కడికి పంపించారు.

వర్షంతో ఆగమాగం

దుబ్బాక: పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో గురువారం వర్షం కురిసింది. వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి పోయింది. దుబ్బాక మార్కెట్‌తో పాటు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. వడ్లకుప్పలపై కవర్లు కప్పినప్పటికీ వరద నీళ్లు కిందకు పోయి మొలకలు వస్తున్నాయంటూ తెలిపారు. వెంటనే కొనుగోలు చేయాలంటూ వారు కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement