సీజనల్‌ వ్యాధుల కట్టడికి చర్యలు | - | Sakshi
Sakshi News home page

సీజనల్‌ వ్యాధుల కట్టడికి చర్యలు

Jun 5 2026 10:21 AM | Updated on Jun 5 2026 10:21 AM

సీజనల్‌ వ్యాధుల కట్టడికి చర్యలు మెరుగైన సేవలే లక్ష్యం పెద్ద మాసాన్‌పల్లిలో సంపూర్ణ మద్యనిషేధం 6న చదరంగం పోటీలు

డీఎంహెచ్‌ఓ ధన్‌రాజ్‌

మిరుదొడ్డి(దుబ్బాక): వచ్చే వానాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు డీఎంహెచ్‌ఓ ధన్‌రాజ్‌ తెలిపారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీ కేంద్రాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నమోదవుతున్న ఓపీని, రికార్డులను, రోగులకు అందిస్తున్న వైద్య విధానాన్ని, ఫార్మసీ ల్యాబ్‌ను, పీహెచ్‌సీ పరిసరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెంగీ, మలేరియా వంటి జ్వరాలు సోకకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆయా గ్రామాల్లో ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా చర్యలు చేపట్టాలని కోరారు. వ్యాధులు ప్రభలకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించేలా అన్ని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో క్లస్టర్‌ హెల్త్‌ ఆఫీసర్‌ లింగమూర్తి, ఫార్మసిస్టు శ్రీనివాస్‌, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌

మున్సిపల్‌ కమిషనర్‌ గణేశ్‌రెడ్డి

గజ్వేల్‌: మెరుగైన సేవలే లక్ష్యంగా పనిచేస్తామని గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ గణేశ్‌రెడ్డి అన్నారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గురువారం మున్సిపాలిటీ పరిధిలోని 1, 2, 3, 4, 5 వార్డుల్లో నిర్వహించిన సభల్లో ప్రసంగించారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. పౌర సేవల్లోనూ ఎలాంటి జాప్యానికి తావులేకుండా సకాలంలో అందేలా చూస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అంతేకాకుండా వార్డుల్లో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. ఇంకా ఈ సభల్లో మున్సిపల్‌ మేనేజర్‌ బాలకృష్ణ, వార్డు ఇన్‌చార్జిలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

గ్రామపంచాయతీ తీర్మానం

తొగుట(దుబ్బాక): మండలంలోని పెద్ద మాసాన్‌పల్లిలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తూ గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. గ్రామంలోని రైతు వేదికలో సర్పంచ్‌ ప్రవీణ్‌రెడ్డి అధ్యక్షతన గురువారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో బెల్ట్‌షాపులు నిర్వహించినా, బహిరంగ ప్రదేశాల్లో సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే రూ.10వేలు, బెల్ట్‌ షాపులు నిర్వహిస్తే రూ. 50వేల జరిమానా విధిస్తామని ఆయన హెచ్చరించారు. గ్రామంలో విచ్చల విడిగా విక్రయాలు జరుగుతుండటంతో చిన్న పిల్లలు సైతం మద్యానికి అలవాటయ్యారన్నారు. ప్రజలు సహకరించి గ్రామాన్ని మద్యపాన రహిత గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ బోయిని శ్రీనివాస్‌, పంచాయతీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

గజ్వేల్‌: నియోజకవర్గస్థాయి చదరంగం పోటీలను ఈ నెల 6న పట్టణంలోని సెయింట్‌ జేవీఆర్‌ పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్నట్లు స్థానిక ఫిజికల్‌ డైరెక్టర్‌ ఎలియాస్‌రావు గురువారం తెలిపారు. బాలబాలికలకు అండర్‌–14, 17 కేటగిరీలుగా విభజించి ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనదలిచినవారు చెస్‌బోర్డు, ఆధార్‌ కార్డుతో ఆ రోజు ఉదయం 9గంటలకు హాజరుకావాలని సూచించారు. శుక్రవారం సాయంత్రంలోగా 9989170936 నంబర్‌కు ఫోన్‌ చేసి పేర్లు ఎంట్రీ చేసుకోవాలన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement