అనుమతి లేని ప్రైవేటు పాఠశాలలను
నిబంధనలు పాటించాల్సిందే
సాక్షి, సిద్దిపేట: ‘అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలలను సీజ్ చేస్తాం. బడుల పునఃప్రారంభం రోజే విద్యార్థులకు పుస్తకాలు, నోట్ బుక్స్ అందజేస్తాం. ఈ సారి బ్రేక్ ఫాస్ట్, 12 రకాల కిట్లు సైతం అందుబాటులోకి రానున్నాయి. జిల్లాలో ఈ నెల 12 వరకు బడిబాట కొనసాగనుంది’ అని జిల్లా విద్యా శాఖాధికారి వరగంటి శాస్త్రి అన్నారు. నూతన డీఈఓగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గురువారం ఆయనను సాక్షి పలకరించింది. వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే..
ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రైవేట్ పాఠశాలలను కొనసాగిస్తే వాటిని సీజ్ చేస్తాం. అలాగే పాఠశాలలకు ముందు ఇంటర్నేషనల్, వరల్డ్, టెక్నో ఇలా ఆకర్షణీయంగా పేర్లు పెడితే చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ప్రైవేట్ పాఠశాలలు కొనసాగించాలి. ఎలాంటి లాభాలు లేకుండా పుస్తకాలను అందించాలి. ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేయవద్దు. యూనిఫాంలు స్కూళ్లలో విక్రయించవద్దు.
పండుగ వాతావరణంలో పిల్లలను స్వాగతిస్తాం
ఈ నెల 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. పండుగ వాతావరణంలో పిల్లలను స్వాగతిస్తాం. జిల్లాలో 938 ప్రభుత్వ పాఠశాలలో 81,229 మంది విద్యార్థులుండగా అందులో బాలురు 38,508, బాలికలు 42,721 మంది విద్యను అభ్యసిస్తున్నారు. వీరి పాఠశాల ప్రారంభం రోజునే పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్‌లు సిద్ధంగా ఉంచాం. పాఠ్యపుస్తకాలు 5,33,478 మొదటి విడతలో అవసరం ఉండగా 100శాతం వచ్చాయి. ఇప్పటికే ఎమ్మార్సీలకు పాఠ్యపుస్తకాలు చేరుకున్నాయి. సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం, పౌష్టికాహార మధ్యాహ్న భోజనం అమలు, నిష్ణాతులైన ఉపాధ్యాయలున్నారు. అలాగే ఈ సారి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా 12 రకాల వస్తువులతో విద్యార్థులకు కిట్‌లను అందించనుంది.
బడిబాటలో ఇంటింటికీ ఉపాధ్యాయులు
జిల్లాలో బడి బాట కార్యక్రమం కొనసాగుతోంది. బడి ఈడు పిల్లలు అందరూ బడిలో ఉండాలే తప్ప పనులకు వెళ్లవద్దు. ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందిస్తున్నాం. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి సౌకర్యాల గురించి వివరించి, ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా కృషి చేస్తున్నాం. విద్యార్థుల సంఖ్య పెంచడంపై దృష్టి సారిస్తున్నాం. విద్యా బోధన సరిగా జరిగేలా కాంప్లెక్స్ హెచ్‌ఎం, ఎంఈఓలతో పాటు విస్తృతంగా తనిఖీలతో బడుల పర్యవేక్షిస్తాను.
సర్కారు బడుల పటిష్టతకు కృషి
విద్యార్థుల సంఖ్య పెంచుతాం
బడిబాటలో ఇంటింటికీ వెళ్లి సౌకర్యాలు వివరిస్తున్నాం
‘సాక్షి’ తో డీఈఓ వరగంటి శాస్త్రి
86కొత్తగా ప్రీ ప్రైమరీ స్కూల్స్
ఆటపాటలతో కూడిన ఇంగ్లిష్ బోధనతో ఈ సారి కొత్తగా 86ప్రీ ప్రైమరీ స్కూల్స్‌ను ప్రారంభిస్తున్నాం. ప్రైవేట్‌కు దీటుగా ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ మీడియంలో బోధనకు చర్యలు తీసుకుంటాం. ఆట వస్తువులన్నీ ఏర్పాటు చేశాం.


