సిద్దిపేటకమాన్/నంగునూరు(సిద్దిపేట): పెరిగిన భూముల మార్కెట్/రిజిస్ట్రేషన్ విలువలు శుక్రవారం నుంచి అమలులోకి రానున్న నేపథ్యంలో గురువారం జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలన్నీ క్రయవిక్రయదారులతో రద్దీగా మారాయి. సిద్దిపేటలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉదయం 9.30నుంచి రాత్రి 7.30 పొద్దుపోయే వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగింది. ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువలపై సుమారు 20నుంచి 30శాతం పెంచనున్నట్లు సమాచారం. దీంతో ప్లాట్ల క్రయ విక్రయదారులు చార్జీలు పెరుగుతాయనే ఉద్దేశ్యంతో రిజిస్ట్రేషన్‌లు చేసుకోవడానికి ఆసక్తి చూపారు. గురువారం ఒక్క రోజే సిద్దిపేట అర్బన్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 52డాక్యుమెంట్లు, రూరల్ లో 45 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగాయి. మార్కెట్ విలువలు పెరగనున్నందున రిజిస్ట్రేషన్లు చేసుకునే వారు ముందస్తుగా కార్యాలయానికి రావడంతో సబ్ రిజిస్ట్రేషన్ కార్యలయం సందడి నెలకొంది.
నంగునూరులో రైతుల నిరీక్షణ
రిజిస్ట్రేషన్ల కోసం నంగునూరు తహసీల్దార్ కార్యాలయానికి రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 9.30కే రైతులు చేరుకోగా తహసీల్ధార్, ఆర్‌ఐ మధ్యాహ్నం 2 గంటల వరకు రాకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. దర్గపల్లి, వెంకటాపూర్, మగ్ధుంపూర్, ఘణపూర్, ఖాత గ్రామాల నుంచి సుమారుగా 50 మంది రైతులు భూముల రిజిస్ట్రేషన్ కోసం ఉదయం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. గంటల తరబడి నిరీక్షించినా అధికారులు రాకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్లు ఆలస్యం కావడంతో వివిధ గ్రామాల నుంచి వచ్చిన మహిళలను, వృద్దులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం వచ్చిన తహసీల్దార్ రాత్రి వరకు భూముల రిజిస్ట్రేషన్లు పూర్తి చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు.


