● ఎండిపోతున్న పల్లె ప్రకృతి వనాలు ● పట్టించుకోని అధికారులు
కొమురవెల్లి(సిద్దిపేట): గ్రామాలలో నివసించే ప్రజలకు ఆహ్లదకరమైన వాతావరణం కల్పించేందుకు గత ప్రభుత్వం 2020లో పంచాయతీల పరిధిలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. వాటికి జాతీయ ఉపాధిహామీ పథకం కింద నిధులు మంజూరుచేసి, గ్రామస్తులు ఎంపిక చేసిన ప్రదేశాలలో వివిధ రకాల మొక్కలను నాటించింది. వాటి నిర్వహణకు ప్రత్యేకంగా ఒక ఉపాధి హామీ కూలీని కూడా నియమించారు.
నిర్వహణలో నిర్లక్ష్యం
ప్రస్తుతం నిర్వహణ లేక పోవడంతో మొక్కలు ఎండిపోతున్నాయి. నిర్వహణకు నిధులు లేకపోవడంతో మొక్కలకు నీరుపట్టని పరిస్థితి నెలకొంది. మండలంలో 11 పంచాయతీలలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. మొదట్లో నిర్వహణను పంచాయతీలకు అప్పజెప్పడంతో అధికారులు, సిబ్బంది పర్యవేక్షణతో కళకళలాడాయి. ప్రస్తుతం ఉపాధి హామీ ద్వారా కూలీలను నియమించక పోవడంతో వాటిని పంచాయతీలు గాలికి వదిలేశాయి. నిధులు, కూలీలు లేక నిర్వహణ దూరమైందని సంబంధిత అధికారులు వాపోతున్నారు.
2024లో నిలిచిన నిధులు
2021 నుంచి 2024 వరకు పల్లె ప్రకృతి వనాల నిర్వహణ కోసం నిధులు మంజూరు చేసేవారు. వాటి ద్వారా వనాలకు అవసరమైయ్యే నీటి తడులు, పర్యవేక్షణకు సిబ్బందిని నియమించారు. దీంతో కొన్నేళ్లపాటు పచ్చదనంతో కళకళలాడాయి. రెండెళ్లుగా నిధులు లేకపోవడంతో ఎండిపోతున్నాయి.


