రాజన్న జాతర చూసొద్దాం
వేములవాడ: ఆధ్యాత్మిక క్షేత్రం.. దక్షిణకాశీగా పేరొందిన వేములవాడలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈనెల 14 నుంచి 16 వరకు మహాశివరాత్రి వేడుకలు భీమన్న క్షేత్రంలో వైభవంగా జరుపనున్నారు. ఈ ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా 2 లక్షల మంది భక్తులు వస్తారని జిల్లా అధికారులు అంచనా వేస్తున్నారు.
● రూ.1.96 కోట్లతో ఏర్పాట్లు
మహాశివరాత్రి జాతర ఉత్సవాల కోసం రూ.1.96కోట్లతో భారీ ఏర్పాట్లు చేశారు. రాజన్న ఆలయ విస్తరణ పనుల నేపథ్యంలో ఈసారి భీమేశ్వరాలయంలో వేడుకలు జరగనున్నాయి. ఇప్పటికే ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. వేములవాడకు చేరుకునే ఐదు ప్రధాన రహదారుల్లో భక్తులకు స్వాగతం పలికేందుకు భారీ స్వాగతతోరణాలు ఏర్పాటు చేశారు. భద్రత కోసం అడుగడుగునా సీసీ కెమెరాలు బిగించారు. భక్తులకు ఉచితంగా టిఫిన్స్, తాగునీరు, బటర్‌మిల్క్ పాకెట్లను సరఫరా చేయనున్నారు.
● చారిత్రక విశిష్టత
క్రీస్తుశకం 750 నుంచి 973 వరకు చాళుక్యరాజులు వేములవాడను రాజధానిగా చేసుకుని పరిపాలన చేశారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. వీరికి పూర్వమే శాతవాహనులు పరిపాలించినట్లు ఆధారాలు ఉన్నట్లు చెబుతుంటారు. శాతవాహనుల కాలం నాటికే వేములవాడలో జైనులు, బౌద్ధుల ఆచార వ్యవహారాలు తెలిపే విగ్రహాలు అనేకం నేటికి ఉన్నాయి.
● దర్శనీయ స్థలాలు
మహాశివరాత్రి సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేశారు. భీమేశ్వరస్వామి దర్శనాలు, కోడెమొక్కులు మాత్రమే అనుమతిస్తారు. భీమన్న ఆలయంతోపాటు బద్దిపోచమ్మ, నగరేశ్వరాలయం, కేదారీశ్వర, వేణుగోపాలస్వామి, నాంపల్లి లక్ష్మీనర్సింహస్వామి, అగ్రహారం జోడాంజనేయ స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు.
● శివరాత్రి పూజలు
మహాజాతర సందర్భంగా భీమన్న ఆలయంలో మూడు రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించారు. ఈనెల 14 నుంచి ప్రారంభమయ్యే జాతర ఉత్సవాల సందర్భంగా నిరంతర దర్శనాలు అందుబాటులో ఉంటాయి. ఉచిత దర్శనంతోపాటు రూ.300 చెల్లించి వీఐపీ దర్శనం, రూ.50 చెల్లించి స్పెషల్ దర్శనాలు, రూ.100 చెల్లించి కోడెమొక్కులు, రూ.200 స్పెషల్ కోడె మొక్కులు, రూ.300 శీఘ్రదర్శనం టికెట్లపై దర్శనం చేసుకోవచ్చు.
● కోడె మొక్కు విశిష్టత
సంతానం లేని దంపతులు కొడుకు పుడితే కోడె కట్టేస్తామని రాజన్నకు మొక్కుంకుంటారు. సంతానం కలిగిన తర్వాత వేములవాడకు చేరుకుని స్వామి వారికి కోడెమొక్కు చెల్లించుకుంటారు. వ్యవసాయం బాగుండాలని మొక్కుకునే రైతుల సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ పాడిపంటలు బాగుండాలని మొక్కుకున్న రైతులు నిజకోడెలను స్వామి వారికి అప్పగించి మొక్కులు తీర్చుకుంటారు.
● ఉచిత భోజనం..టిఫిన్
మహాశివరాత్రి సందర్భంగా మూడు రోజులపాటు స్థానిక ట్రస్టుల ఆధ్వర్యంలో లక్ష్మీగణపతి కాంప్లెక్స్‌లో ఉచితంగా భోజన సౌకర్యం, పార్వతీపురంలో ఉచిత భోజన వసతి, టిఫిన్ సౌకర్యం ఏర్పాటు చేశారు. భక్తుల దాహార్తిని తీర్చేందుకు 6 లక్షల నీటి ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. ఆరు రాజన్న జలప్రసాదాల సెంటర్లు ఏర్పాటు చేశారు. ఉచితంగా మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేస్తున్నారు.
● అత్యవసర సేవలు
జాతర పర్వదినాల సందర్బంగా పోలీస్ కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేశారు. అమ్మవారి కాంప్లెక్స్, నందీశ్వర కాంప్లెక్స్‌లో తాత్కాలిక వైద్యశాలను ఏర్పాటు చేశారు. పార్కింగ్ స్థలాలు, వసతిగదుల వద్ద నిరంతరం వైద్యసేవలు అందుబాటులో ఉంచుతున్నారు. వీటిని పర్యవేక్షించేందుకు ఒక స్పెషల్ ఆఫీసర్‌తోపాటు 13 మంది నోడల్ ఆఫీసర్లను కలెక్టర్ గరీమా అగ్రవాల్ నియమించారు. మొబైల్ అంబులెన్స్, ఫైర్ సేవలు సైతం అందుబాటులోకి తెచ్చారు. 1,600 మంది పోలీసుల ఆధ్వర్యంలో బందోబస్తు చేపడుతున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు.
దర్శిద్దాం..తరిద్దాం
2 లక్షల మంది వస్తారని అంచనా
రూ.1.96 కోట్లతో ఏర్పాట్లు
నేటి నుంచి భీమన్న ఆలయంలో ఉత్సవాలు షురూ
పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్
సమాచార ఫోన్ నంబర్లు ఇవీ..
ఏఎస్పీ రుత్విక్‌సాయి : 87126 56412
ఈవో రమాదేవి : 94910 00743
వైద్యాధికారి రజిత : 70975 57119
ఆర్టీసీ డీఎం శ్రీనివాస్ : 99592 25926
టౌన్ సీఐ వీరప్రసాద్ : 87126 56413
ఇలా చేరుకోవచ్చు..
హైదరాబాద్‌కు 150 కిలోమీటర్లు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రానికి 32 కిలోమీటర్లు దూరంలో వేములవాడ పట్టణం ఉంది. రాజన్నను దర్శించుకోవాలంటే రోడ్డు మార్గం ఒక్కటే. సికింద్రాబాద్ జూబ్లీబస్టాండు నుంచి ప్రతి అరగంటకో బస్సు, కరీంనగర్ నుంచి ప్రతీ పది నిమిషాలకో బస్సు సౌకర్యం ఉంది. రైల్వేసౌకర్యం లేదు. హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు సిద్దిపేట మీదుగా, వరంగల్ నుంచి వచ్చే వారు కరీంనగర్ మీదుగా వేములవాడకు రోడ్డుమార్గంలో చేరుకోవచ్చు. మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా గుడిచెరువు కట్టకింద ప్రత్యేక బస్టాండు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం కౌంటర్లు ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాలకు టికెట్లు అందుబాటులో ఉంచుతున్నారు. దాదాపు 850 బస్సులను ఆర్టీసీ అధికారులు అందుబాటులో ఉంచుతున్నారు. లోకల్‌లో 14 ఉచిత బస్సులు నడిపించనున్నారు.
రాజన్న జాతర చూసొద్దాం


