మూడోసారి గులాబీ రెపరెపలు
● సిరిసిల్లను అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ ● ప్రజలు కేటీఆర్ వెంట నిలిచారు ● బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య
సిరిసిల్లటౌన్: సిరిసిల్ల మున్సిపాలిటీపై ముచ్చటగా మూడోసారి గులాబీ జెండా రెపరెపలాడుతుందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ధీమా వ్యక్తం చేశారు. పట్టణంలోని తెలంగాణ భవన్‌లో గురువారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగస్వాములైన పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతలపై అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు అధికారులు, పోలీసులను అడ్డుపెట్టుకొని దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. వస్త్రపరిశ్రమ యజమానులు, ఆసాములను బెదిరించారన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఇవ్వబోమని భయపెట్టారని పేర్కొన్నారు. కానీ సిరిసిల్ల ప్రజలు కేటీఆర్‌పై నమ్మకం ఉంచి తమ పార్టీకి మరోసారి పట్టం కట్టబోతున్నారన్నారు. రేపటి ఫలితాలు కాంగ్రెస్, బీజేపీలకు చెంపపెట్టుగా మారబోతున్నాయన్నారు. ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, పార్టీ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, రాష్ట్ర నాయకులు చీటి నర్సింగరావు, గూడూరి ప్రవీణ్, మ్యాన రవి, ఎం.డి.సత్తార్, రామాగౌడ్, మల్లికార్జున్ పాల్గొన్నారు.


