అయితే మరమ్మతు.. లేదంటే ప్రత్యామ్నాయం | - | Sakshi
Sakshi News home page

అయితే మరమ్మతు.. లేదంటే ప్రత్యామ్నాయం

Feb 11 2026 8:45 AM | Updated on Feb 11 2026 8:45 AM

అయితే మరమ్మతు.. లేదంటే ప్రత్యామ్నాయం

అయితే మరమ్మతు.. లేదంటే ప్రత్యామ్నాయం

వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు నీటి సరఫరాలో అంతరాయం గుర్తింపునకు స్పెషల్‌ డ్రైవ్‌ జిల్లావ్యాప్తంగా 20రోజుల పాటు కొనసాగుతున్న సమగ్ర సర్వే

పెద్దపల్లి/రామగిరి: వచ్చే వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. ఈమేరకు తాగునీటి పైపులైన్లు, విద్యుత్‌ మోటార్లు, చేతిపంపులు, ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు, తాగునీటి బావులు పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేసేలా సమగ్ర సర్వే నిర్వహిస్తున్నారు. పంచాయతీరాజ్‌ మంత్రి సీతక్క ఆదేశాలతో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు హ్యాబిటేషన్ల వారీగా పరిశీలించి నివేదిక రూపొందించనున్నారు. ప్రతీ తాగునీటి పథకం పరిశీలించి, తగిన మరమ్మతులు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై నివేదిక సిద్ధం చేయనున్నారు. తక్షణ మరమ్మతుల కోసం నిధులు మంజూరవుతాయని చెబుతున్నారు.

20రోజుల పాటు సర్వే

జిల్లాలోని అన్ని ఆవాసాల్లో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి నుంచి 20వ తేదీ వరకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. ప్రతీ గ్రామంలో తాగునీటి వన రుల స్థితిగతులు, పనిచేయని పథకాలు, లీకేజీలు, మోటార్ల పరిస్థితి, పైపులైన్‌ లోపాలను గుర్తిస్తారు. ఆ తర్వాత అవసరమైన మరమ్మతులపై ప్రభుత్వానికి నివేదించనున్నారు. జిల్లాలో దాదాపు 12,000 వరకు ప్రభుత్వ బోరుబావులు(చేతిపంపులు – పవర్‌ బోర్లతో కలిపి) ఉన్నాయని అంచనా. ఇందులో 450 – 500 వరకు బోరుబావులను వెంటనే మరమ్మతు చేయాలని అధికారులు గుర్తించారు.

ప్రత్యామ్నాయాలు

గత మూడేళ్లలో ప్రతీవేసవిలో తలెత్తిన తాగునీటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వచ్చే వేసవిలో తాగునీటి సమస్యలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. దీంతోపాటు అత్యవసర సమయాల్లో వినియోగించుకునేందుకు బోరుమోటార్లను సిద్ధంగా ఉంచుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు జిల్లా అధికారులు ఆదేశాలు జారీచేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో అద్దెకు తీసుకునేందుకు వీలుగా పబ్లిక్‌ బోర్లను ముందుగానే గుర్తించారు. తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తక్షణమే పరిష్కరించుకునేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గ్రామాల్లో చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌కు పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి మంచినీటి ట్యాంకుల పరిసరాలు, తాగునీటి సరఫరాను పరిశీలిస్తారు. తాగునీటి సమస్య ఏర్పాడకుండా ముందస్తు తీసుకోవాల్సిన చర్యలపై పంచాయితీ కార్యదర్శులకు సూచనలిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement