నేనేమన్నా రౌడీనా..! దొంగనా..!?

Warangal Police Arrest V Hanumantha Rao Visit Pule Statue - Sakshi

మేం గిట్లా జేస్తే కేసీఆర్‌ సీఎం అయ్యేటోడా..!

మాజీ ఎంపీ హన్మంతరావు ఆవేదన 

ఫూలే విగ్రహం ధ్వంసమైన ప్రాంతాన్ని 

సందర్శించడానికి వరంగల్‌కు వస్తుండగా 

నెల్లుట్ల శివారులో అరెస్ట్‌ చేసిన పోలీసులు

లింగాలఘణపురం : ‘రాష్ట్రంలో నేడు అప్రజాస్వామిక పాలన సాగుతోంది.. ప్రతిపక్షమే లేకుండా చేయాలనే తలంపుతో అడుగడుగునా అరెస్టులు చేస్తున్నారు.. ఇదేం ప్రజాస్వామ్యం’ అని మాజీ ఎంపీ హన్మంతరావు అన్నారు. వరంగల్‌ నగరం ఉర్సు ప్రాంతంలో ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు మహాత్మా జ్యోతీరావు ఫూలే విగ్రహాన్ని ధ్వంసం చేయగా.. సంఘటన స్థలాన్ని పరిశీలించేందుకు హన్మంతరావు మంగళవారం హైదరాబాద్‌ నుంచి వస్తున్నారు. ఈ క్రమంలో జనగామ –నెల్లుట్ల బైపాస్‌లోని నెల్లుట్ల శివారున ఆయనను పోలీసులు అరెస్టు చేసి లింగాలఘణపురం స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా పోలీసుస్టేషన్‌లో హన్మంతరావు విలేకరులతో మాట్లాడుతూ.. జ్యోతీరావుఫూలే విగ్రహాన్ని ఎందుకు ధ్వంసం చేశారు.. ఎవరు చేశారు.. దుండగులా.. రాజకీయ పార్టీలా అనే విషయాన్ని తెలుసుకుని అదే ప్రాంతంలో నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు తాను వెళ్తుంటే అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తే ప్రజాభిప్రాయం ఎప్పుడు తీసుకుంటావంటూ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. తమను మాత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లనీయడంలేదని, అధికార పార్టీ నాయకులు మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వెళుతున్నారని, వారికి ఏ ఆంక్షలు లేవన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డికి ఏమైనా రాజ్యసభ మెంబర్‌ ఇస్తానని అన్నాడా.. ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించారు.  

మేం గిట్లా జేస్తే కేసీఆర్‌ సీఎం అయ్యేటోడా..?
తెలంగాణ ఉద్యమ సమయంలో రోడ్లపై వంటావార్పు, అనేక రకాల ఉద్యమాలు చేస్తే ఏనాడు కాంగ్రెస్‌ పార్టీ ఆపలేదు.. గిట్ల చేస్తే కేసీఆర్‌ సీఎం అయ్యేటోడా అంటూ హన్మంతరావు ప్రశ్నించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో దళితుడు చనిపోతే వెళ్లనీయరు ఇదెక్కడి న్యాయమని అన్నారు. తమను ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు చేస్తున్నారని, అలా కాకుండా ఇంట్లో నుంచి వెళ్లకుండా జైళ్లల్లో పెట్టండి.. అప్పుడు ఏ లొల్లీ ఉండదని చెప్పారు. ప్రతిపక్షాన్ని లెక్కచేయకుండా పాలన సాగిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమని అన్నారు. 

హన్మంతరావుతో పాటు మరికొందరిపై కేసులు
ఇదిలా ఉండగా మాజీ ఎంపీ హన్మంతరావును ఉదయం 10.30 గంటలకు జనగామ సీఐ మల్లేశ్‌యాదవ్, స్థానిక ఎస్సై రవీందర్‌ ఆధ్వర్యంలో అరెస్టు చేసి సాయంత్రం నాలుగు గంటలకు సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు. ఆయనతో పాటు కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లింగాజీ, యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దిలీప్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండల పార్టీ అధ్యక్షుడు శివతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. హన్మంతారావు సుమారు నాలుగున్నర గంటలు పోలీసుస్టేషన్‌లోనే ఉండడంతో గీసుకొండ ఎంపీపీ భీమగాని సౌజన్య, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు జమాల్‌ షరీఫ్, ధర్మపురి శ్రీనువాసు, నరేందర్‌రెడ్డి, స్థానిక సర్పంచ్‌ విజయ్‌మనోహర్, ఎంపీటీసీ బిక్షపతి తదితరులు ఆయనను కలిసి మద్దతు తెలిపారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top