ఎదురుదాడిలో ఎక్కడా తగ్గొద్దు! 

Telangana Ruling Party TRS Party Comments On BJP Party - Sakshi

ప్రతిదాడులకు కూడా వెనకడుగు వేయొద్దంటూ టీఆర్‌ఎస్‌ సంకేతాలు 

కేసీఆర్‌ ఫ్యామిలీపై ఆరోపణలకు గులాబీ దళం ప్రతిస్పందన 

బీజేపీ శాంతిభద్రతల సమస్య సృష్టిస్తుందనే ప్రచారం 

కవితపై తప్పుడు ఆరోపణలు చేసిన నేతలపై ఫిర్యాదులు 

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నిక దిశగా పావులు కదిపి రాష్ట్ర రాజకీయాలను హీటెక్కించడం ద్వారా పట్టుసాధించాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు దీటుగా ప్రతిస్పందించాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. మునుగోడులో కేంద్ర మంత్రి అమిత్‌ షా బహిరంగ సభ, బండి సంజయ్‌ పాదయాత్ర, కేసీఆర్‌ కూతురు, ఎమ్మెల్సీ కవిత లక్ష్యంగా అవినీతి ఆరోపణలు, ఎమ్మెల్యే రాజాసింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలతో టీఆర్‌ఎస్‌పై ముప్పేట దాడిని ప్రారంభించిన బీజేపీపై అదేస్థాయిలో ఎదురుదాడి చేయాలని గులాబీ పార్టీ నిర్ణయించింది.

తెలంగాణను ఆర్థికంగా ఇబ్బందులు పెట్టాలని చూడటంతోపాటు ఈడీ, సీబీఐ దాడులంటూ బీజేపీ బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు పాల్పడుతోందని ఇన్నాళ్లూ టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ విమర్శిస్తూ వస్తున్నారు. కేసీఆర్‌ కుటుంబపాలన, ప్రాజెక్టుల్లో అవినీతి అంటూ ఆరోపణలు చేస్తున్న బీజేపీ.. తాజాగా కవితను లక్ష్యంగా చేసుకోవడాన్ని టీఆర్‌ఎస్‌ సవాలుగా తీసుకుంటోంది. అటు సోషల్‌ మీడియాలో ప్రచారం, ఇటు క్షేత్రస్థాయిలో ఆందోళనల పేరిట ఉద్వేగాన్ని సృష్టించడం ద్వారా లబ్ధి పొందేందుకు బీజేపీ చేస్తున్న యత్నాలను అడ్డుకోవడంపైనా గులాబీ దళం దృష్టి కేంద్రీకరించింది. 

బీజేపీతో శాంతిభద్రతల సమస్య 
రాష్ట్రంలో బీజేపీ ఉద్రిక్తతలు, ఉద్వేగాలను సృష్టించి హింసను ప్రేరేపించాలని చూస్తోందని టీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. బీజేపీ చర్యలపై సంయమనం పాటిస్తున్నామని ప్రకటనలు చేస్తున్నా.. ఎక్కడా తగ్గకుండా ఎదురుదాడికి దిగాలని పార్టీ కేడర్‌కు టీఆర్‌ఎస్‌ నేతలు సంకేతాలు ఇస్తున్నారు. ఇటీవలి కాలంలో దేవరుప్పుల, గద్వాల, మునుగోడు తదితర చోట్ల టీఆర్‌ఎస్, బీజేపీ ఘర్షణలు ఈ కోవకు చెందగా, తాజాగా హైదరాబాద్‌లో కవిత నివాసం వద్ద జరిగిన ఘటనను టీఆర్‌ఎస్‌ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి.

భౌతిక దాడులను ప్రేరేపించడం లక్ష్యంగానే బీజేపీ చర్యలు ఉంటున్నందున అదే రీతిలో ప్రతిస్పందించకపోతే పలుచనవుతామనే భావన టీఆర్‌ఎస్‌లో కనిపిస్తోంది. బీజేపీ దుందుడుకు చర్యల వల్ల తలెత్తుతున్న శాంతిభద్రతల సమస్యను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని గులాబీ పార్టీ నిర్ణయించింది. కేసీఆర్‌ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటే ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందనే విషయాన్ని తెలియజేయాలనే వ్యూహంలో భాగంగానే మంగళవారం పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కవిత నివాసానికి వెళ్లి సంఘీభావం ప్రకటించినట్లు సమాచారం.  

ఆరోపణలు చేసిన నేతలపై ఫిర్యాదులు 
ఎమ్మెల్సీ కవితపై అవినీతి ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ పరవేశ్‌ వర్మను అరెస్టు చేయాలంటూ టీఆర్‌ఎస్‌ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల పోలీసులకు ఫిర్యాదులు చేశాయి. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేసేందుకు కవిత సన్నద్ధమవుతుండగా, మరోవైపు పరవేశ్‌ అరెస్టుకు ఒత్తిడి కోసం టీఆర్‌ఎస్‌ నేతలు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. రాజాసింగ్‌ అరెస్ట్, దీక్ష పేరిట ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు బండి సంజయ్‌ చేస్తున్న ప్రయత్నాలను పోలీసులు అడ్డుకోవడం శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే జరుగుతోందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top