పోటీ పడలేం బాబూ

TDP Leaders Are Not Interested In Contesting Municipal Elections - Sakshi

నామినేషన్‌ విత్‌డ్రా చేసుకుంటామంటున్న 30 మంది టీడీపీ అభ్యర్థులు

పార్టీ పరువు పోతుందని ప్రలోభాలకు దిగిన అగ్రనేతలు

ఓడిపోయినా... పోటీలో ఉండాలని వార్నింగ్‌లు

చిత్తూరు కార్పొరేషన్‌ ఎన్నికలపై చేతులెత్తేసిన టీడీపీ  

పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ ప్రభంజనంతో చావుదెబ్బతిన్న టీడీపీ నేతలు మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకురావడం లేదు. మంగళ, బుధవారాల్లో నామినేషన్ల ఉపసంహరణ మొదలుకానుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అందుతున్న లబ్ధి చూస్తూ ఇప్పట్లో టీడీపీ నిలదొక్కుకునే చాన్స్‌ లేదని, పోటీ చేసి ఓటమి చెందడం కన్నా.. తప్పుకోవడమే ఉత్తమమనే నిర్ణయానికి కార్పొరేటర్‌ అభ్యర్థులు వచ్చినట్టు తెలుస్తోంది. ఏకంగా 30 మంది వరకు ఉప సంహరణకు ముందుకొచ్చినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో ఫ్యాన్‌ గాలి వీయడం ఖాయం. పోటీచేస్తే మా పరువుపోతుంది. మమ్మల్ని వదిలేదయండి..’ అంటూ అగ్రనేతల మొహంపైనే చెప్పేస్తుండడం గమనార్హం. 

చిత్తూరు అర్బన్‌: మున్సిపల్‌ ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ చిత్తూరు కార్పొరేషన్‌ ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఓటమి గుబులు మొదలైంది. కార్పొరేషన్‌లో 50 డివిజన్లు ఉన్నాయి. గత ఏడాది నామినేషన్ల స్వీకరణ, పరిశీలన ప్రక్రియ పూర్తయ్యింది. మంగళ, బుధవారాల్లో నామినేషన్ల ఉపసంహరణ మొదలుకానుంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకుని పోటీ చేసినా ఓటమి తప్పదని టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్థులు లోలోన కుమిలిపోతున్నారు. పార్టీ తరఫున నామినేషన్లు వేసిన 30 మంది వరకు ఉపసంహరణకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లి నామినేషన్లు ఉపసంహరించుకుంటా మని చెబుతున్నారు. వారిని టీడీపీ అగ్రనేతలు బుజ్జగించే పనిలో పడ్డారు. ఓటమి చెందిన ఫరవాలేదు పోటీలో ఉండాలంటూ హుకుం జారీ చేస్తున్నారు.

బెంగళూరులో క్యాంపు 
స్వచ్ఛంద ఉపసంహరణకు సిద్ధమవుతున్న టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్థులను మచ్చిక చేసుకునేందుకు ఆ పార్టీ ప్రధాన నేతలు క్యాంపు రాజకీయాలకు తెరతీశారు. ఏకంగా 30 మంది అభ్యర్థులు ఉపసంహరణకు ముందుకు రావడంతో ఆస్థానాలు వైఎస్సార్‌సీపీకి ఏకగ్రీవాలవుతాయని, అధినేత చంద్రబాబు వద్ద మొహం ఎలా చూపించాలని టీడీపీ అగ్రనేతలు తలలు పట్టుకుంటున్నారు. అభ్యర్థుల చేతిలో నగదు పెట్టి బెంగళూరుకు పంపుతున్నారు. సెల్‌ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌చేసి, ఈనెల 4వ తేదీ వరకు చిత్తూరుకు రావొద్దని..ఎన్నికల్లో ఓడిపోయినా ఫరవాలేదు.. పోటీలో ఉండాలని బెదిరిస్తున్నారు.

దీనికి కొందరు అభ్యర్థులు ఒప్పకోవడంలేదు. ‘మీ డాబుకు మేమే దొరికామా..? ఫ్యాన్‌ గాలి వీయడం ఖాయం. ఓటమి తప్పదు. మమ్మల్ని వదిలేయండి..’ అంటూ తెగేసి చెబుతున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో మద్యం సమకూర్చేందుకు టీడీపీ నేతలు కర్ణాటక నుంచి పెద్ద మొత్తంలో సరుకు దిగుమతి చేసుకున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఇందులో భాగంగా అనుమానం ఉన్న వారి ఇళ్లల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. దీన్ని కూడా రాజకీయం చేస్తున్న టీడీపీ నేతలు.. పోలీసులు ఉద్దేశపూర్వకంగా తమను వేధిస్తున్నారంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. పైగా  పోలీసులనే బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ ఈసీకి ఫిర్యాదు చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు.
చదవండి:
కుప్పం పర్యటన: చంద్రబాబుకు ఊహించని దెబ్బ..     
విజయవాడ టీడీపీలో లుకలుకలు..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top