ఆ పోస్టర్ల వెనుక మాజీ మంత్రి గంటా హస్తం ఉందా?.. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది?

TDP Cadre Opposing Payakaraopeta MLA Ticket To Vangalapudi Anitha - Sakshi

పార్టీ ఏదైనా..తమ నేతను గెలిపిస్తాం అని కేడర్‌ చెబుతుంది. కానీ ఒక చోట టీడీపీ స్థానిక నేతలు, కార్యకర్తలు మాత్రం ఆ అభ్యర్థి అయితే ఓడించడం ఖాయం అంటున్నారట. తమ అభ్యంతరాలు కాదని ఆమెకే సీటిస్తే ఓటమి తథ్యమని ముందే ప్రకటించేశారట. ఇంతకీ ఆ కథేంటో మీరే చదవండి

తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ పాయకరావుపేట నియోజకవర్గంలోని నేతలతో ఆమెకు ఉన్న గొడవలు అన్నీ ఇన్నీ కావు. పార్టీ అధికారంలో ఉన్నపుడు ఎమ్మెల్యే కావడంతో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదిడ్డంగా సంపాదించేశారని ఆమెపై తీవ్ర ఆరోపణలున్నాయి. అనిత అవినీతిని వ్యతిరేకించిన నాయకులుపై కక్ష సాధింపు చర్యలకు దిగారని స్థానిక పార్టీ నేతలే చెబుతారు. తనను గెలిపించిన నియోజకవర్గంలో నచ్చని నేతలపై తప్పుడు కేసులు పెట్టించారట. అనిత తప్పుడు కేసులతో విసిగిపోయిన టీడీపీ నేతలు గతంలోనే ఆమెపై తిరుగుబాటు చేశారు. 

2019 ఎన్నికలకు ముందు అనిత వద్దు.. టీడీపీ ముద్దు అంటూ నియోజకవర్గం మొత్తం ప్రచారం చేశారు. పాయకరావుపేటలో అనితకు సీటు ఇస్తే ఓడిస్తామని పార్టీ అధినేతకే నేరుగా వార్నింగ్‌ ఇచ్చారు. పార్టీలోనే తనకున్న వ్యతిరేకతను తట్టుకోలేక అనిత పాయకరావుపేటని వదిలి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో పోటీ చేశారు. అక్కడ పరాజయం పాలవడంతో మళ్లీ పాయకరావుపేటకు మకాం మార్చారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. 

పరాయిచోటుకు వెళ్ళి ఓడిపోయి.. తిరిగి సొంత నియోజకవర్గం పాయకరావుపేటకు చేరుకున్న అనిత తన పాత లక్షణాలను ఏమాత్రం వదులుకోలేదు. స్థానిక టీడీపీ నేతలపై వేధింపులు పర్వం కొనసాగిస్తున్నారు. గతంలో తనపై వ్యతిరేక గళం వినిపించిన నాయకులను ఒక్కొక్కరిని పార్టీ నుండి సస్పెండ్ చేయిస్తున్నారు. ఇటీవల పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నియోజకవర్గంలో కొంతమంది నేతలు పోస్టర్స్ వేయించారు. ఆ పోస్టర్స్ లో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫొటోలు మినహా ఎక్కడా అనిత ఫోటోలు లేవు.

ఈ పోస్టర్ల వెనక మాజీ మంత్రి గంటా హస్తం ఉందని అనిత అనుమానిస్తున్నారు. తన నియోజకవర్గంలో కొంతమంది కాపు నేతలను గంటా ప్రోత్సహిస్తున్నారని ఆమె భావిస్తున్నారు. దీంతో గంటాతో సన్నిహితంగా మెలిగే కాపు నాయకులను గుర్తించిన ఆమె వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. గతంలో అనిత వద్దు.. టీడీపీ ముద్దు అని ఎవరైతే తనకి వ్యతిరేకంగా ప్రచారం చేశారో ఇప్పుడు ఈ పోస్టర్ల వెనక వారే ఉన్నారని అనిత భావిస్తున్నారు.

ఈ పోస్టర్ల వ్యవహారాన్ని పార్టీ నాయకత్వం దృష్టికి అనిత తీసుకెళ్ళారు. తన వ్యతిరేకులుగా భావించిన ఇద్దరిని పార్టీ నుంచి అనిత సస్పెండ్ చేయించారు. అనిత సస్పెండ్ చేయించిన ఆ ఇద్దరు కాపు సామాజికవర్గానికి చెందినవారు కావడంతో ఇప్పుడు పాయకరావుపేట టీడీపీ రాజకీయం మరింత వేడెక్కింది. పాయకరావుపేట ఎస్సీ రిజర్వుడ్ అయినప్పటికీ అక్కడ చక్రం తిప్పేది కాపు సామాజిక వర్గ నాయకులే.

ఇప్పుడు ఇద్దరిని సస్పెండ్‌ చేయించడంతో అనిత మీద ఆగ్రహంతో ఉన్న కాపు సామాజిక వర్గ టీడీపీ నేతలు వచ్చే ఎన్నికల్లో తమ తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. అనితను ఓడించడమే కాకుండా మంచి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తామని సెటైర్లు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్‌ అనితకు ఇస్తే ఊరూరు తిరిగి ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేసి ఓడిస్తామంటూ సవాళ్ళు విసురుతున్నారు. స్థానిక పార్టీ నేతల హెచ్చరికల నేపథ్యంలో అనితకు పాయకరావుపేటలో మళ్లీ సీటు ఇస్తారో లేక గతంలో మాదిరిగా మరో చోటకు మార్చుతారో చూడాలి.
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి వెబ్ డెస్క్‌
చదవండి: ఎస్‌.. వైనాట్‌ 175.. ఏపీలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌ 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top