Rahul And Sonia Gandhi: నేషనల్‌ హెరాల్డ్‌ కేసేంటి?.. ఈ ప్రశ్నలకు బదులేది?

Rahul And Sonia Gandhi: What Is The National Herald Case - Sakshi

ఒకపక్క దేశమంతా 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబురాలు జరుగుతుంటే మరోపక్క స్వాతంత్య్రోద్యమంలో కీలకపాత్ర పోషించిన కాంగ్రెస్‌ నేషనల్‌ హెరాల్డ్‌ కుంభకోణం వివాదంలో నిండా మునిగి తేలుతోంది. ఈ ఉదంతంలో వేల కోట్ల ఆస్తులను కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం కారుచౌకగా కొట్టేసిన వైనం ఆ పార్టీ అక్రమార్జనకు పరాకాష్ట.
ఏమిటీ నేషనల్‌ హెరాల్డ్‌?

స్వాతంత్య్రోద్యమ సమయంలో ప్రజలకు దేశీయ వాణి వినిపించాలన్న ఉద్దేశంతో నెహ్రూ సహా పలువురు జాతీయ నాయకులు రూ.5 లక్షల మూలధనంతో 1938లో నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికను స్థాపించారు. 
1937 నవంబర్‌ 20న అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌) అనే అన్‌ లిస్టెడ్‌ కంపెనీని ఆరంభించారు. దాదాపు 5వేల మంది స్వాతంత్య్ర సమరయోధులు ఇందులో వాటాదారులు. 
రూ.5 లక్షల మూలధనాన్ని 2 వేల ప్రిఫరెన్షియల్‌ షేర్లుగా, 30 వేల ఈక్విటీ షేర్లుగా విభజించారు. ఒక్కో ప్రిఫరెన్షియల్‌ ముఖ విలువ రూ.100, ఈక్విటీ షేరు విలువ రూ.10గా నిర్ణయించారు. 

వేల కోట్ల ఆస్తులు.. రూ.90 కోట్ల నష్టాలు 
ఏజేఎల్‌ నిబంధనల ప్రకారం కంపెనీ ఏ ఒక్కరికీ సొంతం కాదు. వార్తా పత్రిక నిర్వహణ తప్ప ఇతర వ్యాపారాల్లో వేలు పెట్టకూడదు. 
ఇంగ్లిష్‌లో నేషనల్‌ హెరాల్డ్, ఉర్దూలో ఖౌమీ ఆవాజ్, హిందీలో నవ్‌జీవన్‌ పత్రికలను ఏజేఎల్‌ 2008 దాకా ప్రచురించింది. 
స్వాతంత్య్రానంతరం పత్రికకు ఆదరణ తగ్గుతూ వచ్చింది. దాంతో ఏజేఎల్‌ ఆదాయం తగ్గుతూ వచ్చి చివరకు నష్టాల్లో మునిగింది. మరోవైపు కంపెనీ వాటాదారులు 2010 నాటికి 1,057కు తగ్గిపోయారు. 
అయితే స్వాతంత్రోద్యమకాలంలో ఉన్న ఆదరణ కారణంగా ఏజేఎల్‌కు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో భారీగా స్థిరాస్తులు సమకూరాయి. 
ఈ ఆస్తుల విలువ స్వాతంత్రానంతరం భారీగా పెరిగింది. పత్రికలను మూసేసేనాటికి దాదాపు రూ.5వేల కోట్లకు చేరింది. ఇదే సమయంలో కంపెనీ నికర నష్టం రూ.90 కోట్లకు చేరింది. 
వేల కోట్ల ఆస్తులున్న ఏ సంస్థా రూ.90 కోట్ల నష్టాలకు కంపెనీని అమ్ముకోవడం, రుణం తీసుకోవడం జరగదు. కానీ ఇక్కడే కాంగ్రెస్‌ మాయ మొదలైంది. 

తెరపైకి యంగ్‌ ఇండియన్‌ 
2010 నవంబర్లో కేవలం రూ.5 లక్షల మూలధనంతో యంగ్‌ ఇండియన్‌ అనే ప్రైవేట్‌ కంపెనీ పుట్టుకొచి్చంది. 
దీనికి 2010 డిసెంబర్లో రాహుల్‌గాంధీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 2011 జనవరిలో సోనియా కూడా డైరెక్టర్‌ బోర్డులో సభ్యురాలయ్యారు. 
కంపెనీలో 76 శాతం వాటాలు సోనియా, రాహుల్‌ సొంతం. మిగతా 24 శాతం వాటాలూ కాంగ్రెస్‌ నేతలు వోరా, ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌ పేరిటే ఉన్నాయి. 
కాంగ్రెస్‌ నుంచి రూ.90 కోట్ల వడ్డీ లేని రుణం తీసుకునేందుకు 2011 ఫిబ్రవరిలో ఏజేఎల్‌ అంగీకరించింది. 
తర్వాత సదరు రూ.90 కోట్ల రికవరీ హక్కులను కేవలం రూ.50 లక్షలకు కాంగ్రెస్‌ నుం చి యంగ్‌ ఇండియన్‌ కొనుగోలు చేసింది. రికవరీ ముసుగులో ఏజేఎల్‌ షేర్లు దాని పరమయ్యాయి.

స్వామి ఫిర్యాదుతో... 
ఏజేఎల్, యంగ్‌ ఇండియన్‌ ఒప్పందంపై సుబ్రమణ్యస్వామి 2012లో ఢిల్లీ కోర్టులో ఫిర్యాదు చేశారు. 
కేసు కొట్టేయాలన్న సోనియా తదితరుల అభ్యర్థనను 2014లో కింది కోర్టు, 2015లో ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చాయి. 
సోనియా, రాహుల్, వోరా, ఆస్కార్‌ తదితరులు కింది కోర్టులో హాజరవాలని హైకోర్టు ఆదేశించింది. 
2016లో సుప్రీంకోర్టును ఆశ్రయించగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచి్చంది. 
ఈ వ్యవహారంపై 2014లో ఈడీ దృష్టి సారించింది. 2019లో దాదాపు రూ.64 కోట్ల ఆస్తులను అటాచ్‌ చేసింది. 
ఇలా వేలాది కోట్ల నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తులను కాంగ్రెస్‌ అధినాయకత్వం పథకం ప్రకారం చేజిక్కించుకుందన్న వైనం స్పష్టంగా కళ్లముందు కనిపిస్తున్నా ఆ పార్టీ బుకాయిస్తూనే ఉంది. నిజాయతీ నిరూపించుకునే ప్రయత్నాలు చేయకుండా ఇదంతా బీజేపీ కక్ష సాధింపు అంటూ ఆరోపిస్తోంది. పత్రిక పునరుద్ధరణకు రుణమిచ్చామని చెప్పిన కాంగ్రెస్, దాని రికవరీ హక్కులను యంగ్‌ ఇండియన్‌కు కారుచౌకగా రూ.50 లక్షలకే ఎందుకు కట్టబెట్టిందీ చెప్పలేదు. 

ఔరా.. వోరా! 
యంగ్‌ ఇండియన్‌ తరఫున రికవరీ హక్కుల కొనుగోలుకు ప్రతిపాదించిందీ, కాంగ్రెస్‌ కోశాధికారి హోదాలో అందుకు అంగీకరించిందీ, ఏజేఎల్‌ ఎండీగా ఒప్పందంపై సంతకం చేసిందీ వోరాయే. తన త్రిపాత్రాభినయంతో ఈ మొత్తం ఉదంతాన్ని రక్తి కట్టించారు. 
చివరకు రూ.50 లక్షలతో అటు రూ.90 కోట్ల అప్పు మాయమైంది. ఇటు వేలాది కోట్ల ఏజేఎల్‌ ఆస్తులు రాహుల్, సోనియాలకు దక్కాయి. 
ఈ వ్యవహారంలో భారీగా మోసపోయింది ఏజేఎల్‌ వాటాదారులే! కొత్త ఒప్పందాలతో వీరి వాటాలన్నీ కలిపి ఒక్క శాతానికే పరిమితమయ్యాయి.

ఈ ప్రశ్నలకు బదులేది? 
రూ.5 వేల కోట్ల ఆస్తులున్న కంపెనీ రూ.90 కోట్ల నష్టాలను తీర్చేందుకు రుణమెందుకు తీసుకుంది? 
 తన ఆస్తుల్లో ఏదో ఒకదాన్ని విక్రయించో, తాకట్టు పెట్టో రూ.90 కోట్లు ఎందుకు చెల్లించలేదు? 
రూ.90 కోట్ల రుణ రికవరీ హక్కులను యంగ్‌ ఇండియన్‌కు కేవలం రూ.50 లక్షలకు ఎలా ఇచ్చారు? 
యంగ్‌ ఇండియన్‌కు ఏదో ఒక ఆస్తి కట్టబెట్టే బదులు ఏకంగా ఏజేఎల్‌ షేర్లను ఎందుకు కేటాయించారు? 
కేవలం వోరా సంతకాలతో వేలాది కోట్ల ఆస్తులున్న ఏజేఎల్‌ ఎలా యంగ్‌ ఇండియన్‌ పరం ఎలా అయింది? 
ఈ కుంభకోణంతో సంబం ధం లేకపోతే ఈ వ్యవహారాన్ని సోనియా, రాహుల్‌ ఎందుకు సమర్థించారు?  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top