Munugode Politics: మునుగోడు యాక్షన్‌ ప్లాన్‌ రెడీ.. ఓటర్‌ కాళ్లు మొక్కనున్న రేవంత్‌రెడ్డి!

Congress Action Plan Ready In Munugode Constituency - Sakshi

మునుగోడు ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్‌ ప్రచార వ్యూహం

గ్రామానికి ఐదుగురు చొప్పున ప్రచార బాధ్యతలు

ప్రజాస్వామ్యానికి పాదాభివందనం: రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించడమే ధ్యేయంగా కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాలు రూపొందిస్తోంది. ఈ స్థానంలో అభ్యర్థి ఎవరనేది ఖరారు కాకముందే వినూత్నంగా ప్రచారంలోకి వెళుతోంది. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా శనివారం నుంచి ఇక్కడ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న ఆ పార్టీ నేతలు.. లక్ష మంది కాళ్లు మొక్కి ఓట్లడగాలని నిర్ణయించారు. ప్రచారం కోసం ఇప్పటికే 100 రోజుల కార్యాచరణ రూపొందించిన టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి స్వయంగా కాళ్లు మొక్కి ఓట్లు అడిగే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని సమాచారం.

రాజీవ్‌ గాంధీ జయంతి సందర్భంగా ఆయన సంస్థాన్‌ నారాయణపురం మండలం పొర్లగడ్డ తండాలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే గ్రామానికి ఓ సమన్వయకర్తను నియమించారు. రాజీవ్‌ జయంతిలో భాగంగా నియోజకవర్గంలోని 125 గ్రామాలు, పట్టణ ప్రాంతాలు కలిపి మొత్తం 176 చోట్ల కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. టీపీసీసీస్థాయి నేతలతోపాటు పలు జిల్లాల నాయకులు, ప్రజాప్రతినిధులు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. గ్రామానికి ఐదుగురు నేతల చొప్పున పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించనున్నారు. ఇప్పటికే గ్రామానికి ఓ సమన్వయకర్తను నియమించగా, వారికి మరో నలుగురు నాయకులు తోడు కానున్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు వీరంతా గ్రామాల్లోనే ఉండి స్థానిక కేడర్‌తో సమన్వయం చేసుకుంటూ ప్రచారం చేయనున్నారు.

ఈ సందర్భంగా ప్రతిచోటా పేదలకు పండ్లు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం టీపీసీసీ పేరుతో సోనియా, రాహుల్‌గాంధీ చిత్రపటాలతోపాటు రాజీవ్‌గాంధీ బొమ్మ, హస్తం గుర్తుతో కూడిన బ్యాగ్‌ను కూడా రూపొందించారు. అదేవిధంగా మన మునుగోడు–మన కాంగ్రెస్‌ పేరుతో స్టిక్కర్లు, కరపత్రాలు కూడా రూపొందించారు. ఈ స్టిక్కర్లు, కరపత్రాలను శుక్రవారం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆవిష్కరించారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు
మునుగోడు నియోజకవర్గ ఇన్‌చార్జులు,ముఖ్య నేతలతో రేవంత్‌రెడ్డి జూమ్‌ సమావేశం నిర్వహించారు. రాజీవ్‌ గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించనున్న మన మునుగోడు–మన కాంగ్రెస్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్‌ నేతలు పార్టీ జెండాలు ఎగురవేసి రాజీవ్‌గాంధీకి నివాళులర్పించాలని, ఆయన దేశం కోసం చేసిన త్యాగం, సేవల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ, టీఆర్‌ఎస్‌లు పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నాయని, నాయకులను నిస్సిగ్గుగా కొనుగోలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని ఆరోపించారు.

అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆ రెండు పార్టీలను ఎదుర్కొనాలంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అందులోభాగంగా ‘ప్రజాస్వామ్యానికి పాదాభివందనం’ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. తనతో సహా వెయ్యి మంది నాయకులు వంద మంది చొప్పున మొత్తం లక్ష మందికి పాదాభివందం చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడే పోరాటంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.
చదవండి: మునుగోడులో బరిలోకి రేవంత్‌.. కాంగ్రెస్‌ ప్లాన్‌ ఫలిస్తుందా..?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top