నిజాలను దాచి.. అబద్ధాలు | BRS Leader Harish Rao Comments On Ponguleti | Sakshi
Sakshi News home page

నిజాలను దాచి.. అబద్ధాలు

Apr 10 2026 2:04 AM | Updated on Apr 10 2026 2:04 AM

BRS Leader Harish Rao Comments On Ponguleti

నిన్నటి ప్రెస్‌మీట్‌లో తాను పొంగు‘లూటీ’అని చెప్పకనే చెప్పాడు 

మంత్రి పొంగులేటిపై మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం 

సంస్థను, కొడుకును కాపాడుకోవాలనే తాపత్రయం స్పష్టంగా కనపడింది 

క్రషర్‌పై సీఎం, మైనింగ్‌ మంత్రి చెప్పింది తప్పో.. పొంగులేటి చెప్పింది తప్పో తేల్చాలని డిమాండ్‌

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: సచివాలయం వేదికగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నిజాలను దాచి అబద్ధాలు మాత్రమే మాట్లాడారని బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్, మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ‘గొంతు చించుకునో, పిట్ట కథలు చెప్పో సంస్థను, కొడుకును కాపాడుకోవాలి.. దాని నుంచి బయటపడాలని ఆయన తాపత్రయపడినట్లు స్పష్టంగా కనపడింది. నిన్నటి ప్రెస్‌మీట్‌తో ఆయన తాను పొంగులేటి కాదు పొంగు‘లూటీ’ అని చెప్పకనే చెప్పాడు..’అని అన్నారు. గొల్లపల్లి–చీర్కపల్లి రిజర్వాయర్‌ వద్దంటూ వనపర్తి జిల్లా రేవల్లి మండలం గొల్లపల్లిలో అఖిలపక్షం ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన ధర్నా, బహిరంగసభలో ఆయన మాట్లాడారు. అంతకు ముందు నాగపూర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలోనూ మాట్లాడారు. 
 
ఎవరు చెప్పింది తప్పో తేల్చాలి.. 
‘క్రషర్‌ గురించి మా మంత్రి కంపెనీ రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌లో జరిగిన అవినీతి, అవకతవకలను ప్రతిపక్షం వాళ్లు ఎవరూ బయటకు తీయలేదు. మా అధికారులే గుర్తు పట్టారు.. మేమే పెనాల్టీ వేసినం.. మేమే పైసలు కట్టించామని రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా శాసనసభలో చెప్పారు. కరెంట్‌ మీటర్ల కొరత ఉండడంతో రాఘవ కంపెనీ డీజిల్‌ జనరేటర్ల మీద నడుపుకున్నదని అసెంబ్లీలోనే మైనింగ్‌ మంత్రి చెప్పారు. అనుమతుల గురించి అడిగితే అనుమతులు లేట్‌ అయితవి కదా.. ఢిల్లీలో పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డుకు అప్లయ్‌ చేసుకున్నాడంటూ సమాధానమిచ్చారు. మరి వీరు చెప్పింది తప్పా.. పొంగులేటి చెప్పింది తప్పా అనేది తేల్చాలి. దీనిపై ఆయనే సమాధానం ఇవ్వాలి..’అని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. 

ఇవి నిజాలు కావా? అప్పుడెందుకు చెప్పలేదు? 
‘రాఘవ మీద కేసులు పెట్టాం.. డబ్బులు వసూలు చేశామని మీ ముఖ్యమంత్రి, మైనింగ్‌ మంత్రి, మీ సహచరులే చెప్పారు.. నాలుగు శాఖల అధికారులు మూడుసార్లు నోటీసులు ఇచ్చారు.. చర్యలు తీసుకోవాలని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డుకు లేఖలు రాశారు.. కంటైనర్‌పై కాంగ్రెస్‌ జెండా లేదా?.. రాఘవ పేరు లేదా?.. అధికారుల నోటీసులకు నీ ఉద్యోగి రిసీవ్డ్‌ అని సంతకం పెట్టలేదా?.. ఆ డాక్యుమెంట్లనే కదా నేను అసెంబ్లీలో చూపించింది.. ఇవి నిజాలు కావా? ముఖ్యమంత్రి, మైనింగ్‌ మంత్రి చెబుతున్నప్పుడు నువ్వు అసెంబ్లీలోనే ఉన్నావు కదా.. అప్పుడు ఇది నాది కాదు, అసలు రాఘవకు మైన్‌ లేదని ఎందుకు చెప్పలేదు? అప్పుడు అసెంబ్లీలో చెప్పకుండా 12 రోజుల తర్వాత నాకేం సంబంధం లేదంటూ బుకాయిస్తున్నాడు..’అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. 

నాదర్‌గుల్‌ భూములను కాపాడింది బీఆర్‌ఎస్సే.. 
‘నాదర్‌గుల్‌ భూములు బీఆర్‌ఎస్‌ హయాంలో రిజిస్ట్రేషన్‌ అయ్యాయని చిల్లర కథ చెబుతున్నారు. 2016లో ఈ భూములను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తే, 22ఏ కింద నిషేధిత జాబితాలో పెట్టి కాపాడింది మా ప్రభుత్వమే. కంపెనీలు హైకోర్టుకు పోతే చివరకు డివిజన్‌ బెంచ్‌ అవి సీలింగ్‌ భూములే.. అమ్మినవారి మీద, కొన్నవారి మీద క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలనే జడ్జిమెంట్‌ ఇచ్చింది నిజం కాదా? వీటిని ఎందుకు దాస్తున్నావ్‌? 

ఏక్యూ స్క్వేర్‌లో నీ కొడుకు భాగస్వామి కాదా? 
కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అవి ప్రభుత్వ భూములే అని మా ఆర్డీఓ సుప్రీంకోర్టులో ఫైల్‌ చేశాడని పొంగులేటి చెబుతున్నాడు. æమరి బోర్డుల మీద రోజుకొక పేరు (కోహినూర్, శిల్ప, ఏక్యూ స్క్వేర్, కోహినూర్‌ సింప్లెక్స్‌ వంటివి) ఎందుకు మారుతున్నాయి? ఏక్యూ స్క్వేర్‌లో నీ కొడుకు భాగస్వామి కాదా? శిల్పతో రాఘవ కంపెనీకి హైదరాబాద్‌లో వ్యాపార సంబంధాలు లేవా? ఇవి నిజాలు కావా?..’అని హరీశ్‌రావు ప్రశ్నించారు. చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే ప్రైవేట్‌ వ్యక్తుల ఆదీనంలో ఉన్న ఆ ప్రభుత్వ భూమిని స్వాదీనం చేసుకోవాలని.. బౌన్సర్లు, ఆక్రమణదారులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  

పాలనను మాఫియాకు అప్పగించినట్టయ్యింది: ప్రవీణ్‌కుమార్‌  
వనపర్తి: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని, కేసీఆర్‌ను అప్రతిష్ట పాలు చేసేందుకు కాంగ్రెస్‌ నాయకులు మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లను బాంబులు పెట్టి పేల్చారని ఏఈ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ ఎందుకు పూర్తి చేయడం లేదని సభలో మాట్లాడిన బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు పాలనను మాఫియాకు అప్పగించినట్లు అయ్యిందని విమర్శించారు. మానేరు చెక్‌డ్యాంను సైతం కాంగ్రెస్‌ నాయకులు ఇసుక దందా కోసం ఒక్కపూటలో పేల్చి వేశారని ఆరోపించారు. దేశాల మధ్య యుద్ధాలు జరిగినా సాగునీటి ప్రాజెక్టులపై బాంబులు వేసే సంస్కృతి ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement