శుక్రవారం శ్రీ 12 శ్రీ జూన్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

శుక్రవారం శ్రీ 12 శ్రీ జూన్‌ శ్రీ 2026

Jun 12 2026 7:13 AM | Updated on Jun 12 2026 7:13 AM

న్యూస్‌రీల్‌

సాక్షి,పెద్దపల్లి:

‘స్మోకింగ్‌ ఈజ్‌ ఇన్‌జ్యూరియస్‌ టు హెల్త్‌’ అనే విషయం అందరికీ తెలిసినా.. నేడు కొత్తతరం యువత ఈ ఊబిలో పడిపోతున్నారు. వేసవి సెలవుల వేళ.. స్నేహితులతో సరదాగా గడిపే సమయం కాస్తా ఇప్పుడు వ్యసనాలకు అడ్డాగా మారుతోంది. జిల్లావ్యాప్తంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కేఫ్‌లు, టీ స్టాల్స్‌ యువతను ధూమపానానికి అలవాటు చేస్తున్నాయి. ప్రధాన కూడళ్లు, విద్యాసంస్థల పరిసరాలు, పట్టణాలు, గ్రామాల్లోనూ చిన్నా పెద్దా టీ స్టాల్స్‌ పెరుగుతుండటంతో యువతకు ఇవి ప్రధాన మీటింగ్‌ స్పాట్‌గా మారాయి. ముఖ్యంగా వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థులు ఎక్కువ సమయం బయట గడుపుతున్నారు. దీంతో టీ స్టాల్స్‌, కేఫ్‌ల వద్ద గుంపుగా చేరి ధూమపానం చేయడం గణనీయంగా పెరిగింది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు అనేక కేఫ్‌లు, టీ స్టాల్స్‌ వద్ద సిగరేట్లు కాలుస్తూ కనిపిస్తున్నారు. కొట్పా చట్టం ప్రకారం మైనర్లకు, విద్యాసంస్థలకు 100గజాల పరిధిలో పొగాకు విక్రయాలు నిషేధం. విక్రయకేంద్రాల వద్ద 18ఏళ్ల లోపు వారికి పొగాకు ఉత్పత్తుల అమ్మకం నిషేధం అని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. కాగా, క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలుకావడం లేదు. పైగా ప్రతీ టీస్టాల్‌, కేఫ్‌ల వద్ద తెరలు కట్టి స్మోకింగ్‌ జోన్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వాటిలో కళాశాల విద్యార్థులు, యువకులు ఎక్కువగా సిగరేట్లకు బానిసవుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

సినిమాలు, వేసవి సెలవుల ప్రభావం

వేసవి సెలవుల సమయంలో విద్యార్థులకు చదువు ఒత్తిడి లేకపోవడం, పాఠశాలలు, కళాశాలలు మూతపడటంతో ఎక్కువగా స్నేహితులతో గడిపే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో టీ స్టాల్స్‌, కేఫ్‌లు ప్రధాన అడ్డాలుగా మారుతున్నాయి. కొందరు రోజులో పలుమార్లు ఈ ప్రాంతాలకు వెళ్లి గంటల తరబడి గడుపుతుండగా, ధూమపానం చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోందని స్థానికులు పేర్కొంటున్నారు.

ఆరోగ్యంతో చెలాగాటం

ధూమపానం వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె సంబంధిత సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు, క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్న వయస్సులోనే సిగరేట్‌ అలవాటు చేసుకున్నవారిలో ఊపిరితిత్తుల పనితీరు తగ్గిపోవడం, శారీరక సామర్థ్యం క్షీణించడం, మానసిక ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయని పేర్కొంటున్నారు. సిగరెట్‌ కాల్చేవారికే కాకుండా పరోక్ష ధూమపానం వల్ల పిల్లలు, మహిళలు, వృద్ధులు కూడా ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.

తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి

వేసవి సెలవుల సమయంలో పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నారు అనే విషయాలను తల్లిదండ్రులు గమనించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంటికి ఆలస్యంగా రావడం, తరచూ డబ్బులు అడగడం, దుస్తుల నుంచి పొగ వాసన రావడం, ప్రవర్తనలో మార్పులు కనిపించడం వంటి అంశాలను నిర్లక్ష్యం చేయరాదని చెబుతున్నారు. అలాగే ధూమపానం నియంత్రణకు పాఠశాలలు ప్రారంభమైన తర్వాత ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రజారోగ్య నిపుణులు కోరుతున్నారు. విద్యాసంస్థల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఈ– సిగరేట్‌కు ఆకర్షణ

సాధారణ సిగరేట్ల కంటే ఈ– సిగరేట్లు తక్కువ హానికరం అనే అపోహతో కొంతమంది వీటికి ఆకర్షితులవుతున్నారు. యువత వీటిని ఓ ష్యాషన్‌ సింబల్‌గా భావిస్తుండటం, వీటి ధర సైతం తక్కువగా ఉండటంతో వీటికి తొందరగా బానిసలవుతున్నారు. గతంలో అప్పుడప్పుడు మాత్రమే సిగరేట్‌ కాల్చే యువత, ఇప్పుడు రోజువారీ అలవాటుగా మార్చుకుంటున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్నేహితుల ప్రభావం, సినిమాల్లో ధూమపాన దృశ్యాలు, ఫ్యాషన్‌గా భావించడం వంటి అంశాలు కూడా ధూమపానం పెరగడానికి కారణమవుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.

కేఫ్‌ల్లో గుప్పుగుప్పు

ధూమపానానికి అడ్డాగా టీ స్టాల్స్‌

ఫ్యాషన్‌, స్టైల్‌, రిలాక్సేషన్‌, సరదా పేరిట అలవాటు

ఆర్యోగంతో ఆటలాడుతున్న యువత

తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరమంటున్న వైద్యులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement