పెద్దపల్లిరూరల్: జిల్లా రైతులు గతంలో ఎన్నడూ లేని విధంగా వరి, మక్క దిగుబడులు సాధించారు.. జిల్లా వ్యాప్తంగా 334 కేంద్రాలు ఏర్పాటు చేసి వాటన్నింటిని మద్దతు ధరతో కొనుగోలు చేసినట్లు విప్ విజయరమణారావు పేర్కొన్నారు. గురువారం పెద్దపల్లిలో మాట్లాడారు. 4,29,921 మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేసి రూ.1,018.62 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశామన్నారు. అక్కడక్కడ వర్షం కురిసి కొంత ఇబ్బంది కలిగినా తడిసినా, రంగుమారినా చివరిగింజ వరకు కొంటామని సీఎం రేవంత్‌రెడ్డి భరోసా కల్పించారన్నారు.
మరిన్ని గోదాముల నిర్మాణం
పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో పంట దిగుబడులు నిల్వ చేసేందుకు మరిన్ని గోదాములు నిర్మిస్తామని విప్ వివరించారు. ఎలిగేడు మండలం లాలపల్లిలో గిడ్డంగుల సంస్థ, సింగిల్‌విండో ద్వారా రెండు గోదాముల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయన్నారు. ఓదెల, శ్రీరాంపూర్, పెద్దపల్లి మండలాల్లోనూ గోదాముల నిర్మాణాలను చేపడుతామని పేర్కొన్నారు. పంట దిగుబడులను భద్రపర్చుకునేందుకు ఇవి ఉపకరిస్తాయని పేర్కొన్నారు.
అసెంబ్లీకి రాడు.. సూచనలు ఇవ్వడు
‘ప్రజాహితం కోసం అసెంబ్లీకి వచ్చి తమ ప్రభుత్వానికి అవసరమైన సూచనలు ఇవ్వు.. స్వీకరిస్తాం’ అని మాజీ సీఎం కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకుండా కేవలం ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడమే బీఆర్‌ఎస్ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారని విజయరమణారావు ఆరోపించారు. కాళేశ్వరం నీటి చుక్క కూడా పెద్దపల్లి జిల్లాకు అందలేదన్నారు. వస్తే ఎక్కడకు వచ్చాయో ఆధారాలతో చూపాలని సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లలో అనేక లోపాలున్నాయని ప్రజాధనాన్ని బీఆర్‌ఎస్ సర్కారు దుర్వినియోగం చేసిందని దుయ్యబట్టారు. సెంట్రల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదికల ఆధారంగా మరమ్మతు పనులను ప్రభుత్వం చేపట్టిందన్నారు. ప్రభుత్వంపై అర్థరహిత విమర్శలు మాని, ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం విలువైన సలహాలు, సూచనలివ్వాలన్నారు. మార్కెట్ చైర్మన్ కూర మల్లారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు అన్నయ్యగౌడ్, నాయకులు సారయ్యగౌడ్, రాజేశ్వర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, కొమ్ము సుధాకర్, పోచాలు, శ్రీనివాస్, ఆరె సంతోష్, ప్రేంసాగర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విప్ విజయరమణారావు


