జ్యోతినగర్(రామగుండం): ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా డివిజన్‌లను సందర్శిస్తున్నట్లు రామగుండం మేయర్ మహంకాళి స్వామి అన్నారు. గురువారం 32వ డివిజన్‌లో అదనపు కలెక్టర్, కమిషనర్ అరుణశ్రీ, డిప్యూటీ మేయ ర్ పాతిపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్ తోట మమతతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మేయర్ మా ట్లాడారు. ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ ఆదేశాలను అనుసరించి డివిజన్‌లో సందర్శించి ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నట్లు వివరించారు. కాలువల్లో ఏళ్ల తరబడి పూడుకుపోయిన మట్టిని ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా తొలగించి నీరు సాఫీగా ప్రవహించేలా చేయడం జరిగిందన్నారు. మూడునెలల క్రితం ప్రారంభించిన శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిరంతరాయంగా కొనసాగిస్తామని వివరించారు. డివిజన్‌ను అందంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తుంటే ప్రజలు రోడ్లు, కాలువల్లో చెత్త వేయడం సరికాదన్నారు. స్వచ్ఛ రామగుండంగా తీర్చేదిద్దే ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీ మాట్లాడుతూ, వర్షాకాలం దృష్ట్యా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రాధాన్యతా ప్రకారం కాలువల్లో పూడికతీత పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, ఏఈలు తేజస్విని, మనోజ్, కార్పొరేటర్ వెంగల బాపు పాల్గొన్నారు.
మేయర్ మహంకాళి స్వామి


