పెద్దపల్లి: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్‌కుమార్ హెచ్చరించారు. గురువారం వైద్యాధికారులతో డీఎంహెచ్‌వో కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. ప్రభుత్వం నిర్దేశించిన జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు విజయవంతం చేయాలని, ఆశా కార్యకర్త నుంచి వైద్యాధికారి వరకు సమయపాలన పాటించాలన్నారు. జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ, అనుమానితులకు క్షయ పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ అయితే వెంటనే తగిన చికిత్స అందించాలని పేర్కొన్నారు. మాతా శిశు సంరక్షణ అధికారి డాక్టర్ లక్ష్మీభవాని మాట్లాడుతూ, గర్భిణులకు అందించాల్సిన సేవలపై నిర్లక్ష్యం వహించరాదని, మాతాశిశువుకు వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడంలో సమయపాలన పాటించాలన్నారు. 14 నుంచి 15 ఏళ్ల ఆడపిల్లలకు వ్యాక్సిన్ అందేలా చూడాలని కోరారు. డిప్యూటీ డెమో అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


