కోల్‌సిటీ(రామగుండం): పింఛన్ల పంపిణీలో పారదర్శకత పాటిస్తూ, అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన లైవ్ అథెంటిఫికేషన్ ప్రక్రియ వృద్ధులు, దివ్యాంగులకు గుదిబండగా మారుతోంది. కచ్చితంగా లైవ్ అథెంటిఫికేషన్ పూర్తిచేయాలని ఆదేశాలు రావడంతో పింఛన్‌దారులు రామగుండం బల్దియాకు పోటెత్తుతున్నారు. బల్దియాలో మొత్తం 19,740 పింఛన్లు ఉండగా, ఇప్పటివరకు 14,005 మందికి లైవ్ అథెంటిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. సాంకేతిక సమస్యలు, శారీరక ఇబ్బందులతో చాలామంది ఈప్రక్రియ పూర్తి చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమస్యలతో ఆన్‌లైన్‌లో నమోదుకాని వారిని బల్దియా కార్యాలయానికి పంపిస్తున్నారు. ఇలా వచ్చేవారు అనేక తంటాలు పడుతున్నారు.
లబ్ధిదారులకు అనేక సమస్యలు
ప్రత్యేక యాప్‌లో పింఛన్‌దారుల వివరాలను ఆన్‌లైన్ చేయడానికి లైవ్ అథెంటిఫికేషన్ కోసం మొబైల్ ఫోన్‌కెమెరా ఎదుట నిల్చొని కళ్లను మూసి తెరవాల్సి ఉంటుంది. వయోభారం, కంటి సంబంధిత సమస్యలు, శారీరక బలహీనతతో పలువురు వృద్ధులు ఈ ప్రక్రియ పూర్తిచేయలేకపోతున్నారు.
వేలిముద్రలకూ చిక్కులు
ముఖ గుర్తింపు విఫలమైతే వేలిముద్రల ద్వారా అథెంటిఫికేషన్ చేపడుతున్నారు. వృద్ధాప్యం కారణంగా చేతివేళ్ల గీతలు స్పష్టంగా లేకపోవడం, శారీరక శ్రమతో వేలిముద్రలు చెదిరిపోవడంతో బయోమెట్రిక్ యంత్రాలు కూడా స్పందించడం లేదు. పలుమార్లు ప్రయత్నించినా ఈప్రక్రియ పూర్తికాక అధికారులు ప్రత్యామ్నాయ చర్యలకు దిగుతున్నారు.
ఫొటోలు తీసి నమోదు
ముఖ గుర్తింపు, వేలిముద్రలు రెండూ విఫలమైన సందర్భాల్లో పింఛన్‌దారు ఫొటో తీసి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ప్రత్యేక పరిశీలన కోసం వాటిని ఉన్నతాధికారులకు పంపిస్తున్నట్లు తె లుస్తోంది. ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న వారిని లైవ్ అథెంటిఫికేషన్ కింద గుర్తిస్తారా? లే దా? అనేదానిపై అధికారులు కూడా సరిగా వివరణ ఇవ్వలేకపోతున్నారు.
కార్యాలయాలకు రాక తప్పని పరిస్థితి
నడవలేని, మంచానికే పరిమితమైన, దివ్యాంగులు, మానసిక వికలాంగులు, వృద్ధులు తమ కుటుంబసభ్యుల సాయంతో కార్యాలయాలకు చేరుకుంటున్నారు. కొందరిని వీల్‌చైర్లలో తీసుకువస్తుండగా, మరికొందరిని వాహనాల్లో తీసుకొస్తున్నారు. కార్యాలయంలో గంటల తరబడి వేచిఉండాల్సి రావడంతో వారిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ప్రత్యేక ఏర్పాట్లకు డిమాండ్
వృద్ధులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారు, వికలాంగుల కోసం ఇంటి వద్దే లైవ్ అథెంటిఫికేషన్ నిర్వహించే విధానం అమలు చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సాంకేతిక సమస్యలతో అర్హులైన పింఛన్‌దారులు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ విధానాలను అందుబాటులోకి తేవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కానరాని పింఛన్‌దారుల ‘కనుపాప’
ఆన్‌లైన్‌లో నమోదుకాని వేలిముద్ర
బల్దియాకు తరలివస్తున్న పింఛన్‌దారులు
ప్రత్యామ్నాయంగా ఫొటోలు తీస్తున్న సిబ్బంది
ఇబ్బందుల్లో వృద్ధులు, మానసిక, దివ్యాంగులు


