కోల్‌సిటీ: గోదావరిఖనిలోని సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్–ప్రభుత్వ), ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో చోటుచేసుకున్న కీలక వైద్యులు, అధ్యాపకుల బదిలీలు ఆసక్తికరంగా మారాయి. బదిలీల్లో సీనియర్లు వైద్య కళాశాలలు, ఆస్పత్రులకు వెళ్లగా, మరికొందరు సిమ్స్‌లో చేరారు.
భార్యకు జీజీహెచ్, భర్తకు సిమ్స్ పగ్గాలు
ముఖ్యంగా దంపతులైన టి.హిమబిందుసింగ్, టీపీ దయాళ్‌సింగ్‌కు స్థానికంగానే కొత్త బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పిల్లల విభాగం ఇన్‌చార్జి హెచ్‌వోడీ హిమబిందుసింగ్‌ను జీజీహెచ్ మెడికల్ సూపరింటెండెంట్‌గా నియమించారు. జీజీహెచ్ మెడికల్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న దయాళ్‌సింగ్‌ను సిమ్స్(వైద్య కళాశాల) ప్రిన్సిపాల్‌గా బదిలీ చేశారు.
కరీంనగర్ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ నరేందర్
సిమ్స్ ప్రిన్సిపాల్‌గా ఇప్పటిదాకా పనిచేసిన హిమబిందుసింగ్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించి బయోకెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ జి.నరేందర్‌కు ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ బాధ్యతలు అప్పగించారు. తాజాగా నరేందర్‌ను కరీంనగర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు బదిలీ చేయడంతో ఆయన స్థానంలో దయాళ్‌సింగ్‌ను నియమించాల్సి వచ్చింది.
ప్రొఫెసర్ల బదిలీలు కూడా..
జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ ఎ.అశోక్‌ను హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రి, అనెస్థీషియా ప్రొఫెసర్ జి.లక్ష్మీనర్సయ్యను వరంగల్ ఎంజీఎంకు బదిలీ చేశారు. జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ బి.ప్రియాంకను వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీకి, పీడియాట్రిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ ఎం.రాజేశ్‌ను హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి బదిలీ చేయగా, ఆర్థోపెడిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇన్‌చార్జి ఆర్‌ఎంవో డి.రాజు, పీడియాట్రిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎ.శిరీష, ఓబీజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సీహెచ్ లక్ష్మిని మంచిర్యాల ప్రభుత్వ వైద్య కళాశాలకు బదిలీ చేశారు. ఆర్థోపెడిక్స్ కె.సన్నిత్ కుమార్‌ను జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో నియమించారు. మంచిర్యాల ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి బదిలీపై వచ్చిన ఫిజియాలజీ ప్రొఫెసర్ జి.రేఖ సిమ్స్‌లో చేరారు. మంచిర్యాల డీఎంహెచ్‌వో కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ ఆర్.హారికను సిమ్స్‌కు బదిలీ చేశారు.
డిప్యూటేషన్ కోసం హిమబింద్‌సింగ్ ప్రయత్నాలు?
స్థానిక ముఖ్య ప్రజాప్రతినిధులతో సమన్వయం లేకపోవడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ హిమబిందుసింగ్‌కు జీజీహెచ్ మెడికల్ సూపరింటెండెంట్ బాధ్యతలు అప్పగించడం ఆస్పత్రి వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈనెల 8న హిమబింద్‌సింగ్ బాధ్యత లు స్వీకరించారు. ఇదిలా ఉండగా మెడికల్ సూపరింటెండెంట్‌గా పని చేయడం ఇష్టంలేక, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని టీచింగ్ ఆస్పత్రులకు డిప్యూటేషన్‌పై వెళ్లేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
భార్యకు జీజీహెచ్, భర్తకు కాలేజీ పగ్గాలు


