భక్త తీర్థం
● రామతీర్థానికి పోటెత్తిన భక్తజనం
● ముగిసిన మహాశివరాత్రి ఉత్సవాలు
ఆలయ మెట్ల వద్ద
టెంకాయలు కొడుతున్న భక్తులు
నెల్లిమర్ల రూరల్:
రామతీర్థంలో రెండు రోజుల పాటు సాగిన మహాశివరాత్రి ఉత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రాంగణం, కల్యాణమండపం, బోడికొండ తదితర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిశాయి. సమీపంలోని నీలాచలం బోడికొండ, రామస్వామి వారి ఆలయం, కోనేరు గట్టు తదితర ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి తరలివచ్చిన భక్తులు ముందు రోజు రాత్రంతా జాగారాలు చేసి ఉదయాన్నే రామ కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం సీతారామస్వామివారిని పక్కనే ఉన్న ఉమాసదాశివ స్వామివారిని దర్శించుకున్నారు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు ఉమా సదాశివాలయంలో లింగోద్భవ పూజలు వైభవంగా జరిగాయి.
ఆ సమయంలో స్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పోటీ పడ్డారు. ఎస్పీ ఏఆర్ దామోదర్, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, తదితరులు శివాలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భోగాపురం, పూసపాటిరేగ, లావేరు, రణస్థలం, భీమిలి, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి మత్స్యకారులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి ప్రతిమను మధ్యలో ఉంచి చుట్టూ వృత్తంలా ఏర్పడి సంప్రదాయబద్ధంగా నృత్యాలు చేశారు. బోడికొండపై ఉన్న చారిత్రక ఆధారాలను చూడడానికి అధిక సంఖ్యలో సందర్శకులు తరలివెళ్లారు.
భక్త తీర్థం


