కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చాలి | - | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చాలి

Feb 14 2026 7:59 AM | Updated on Feb 14 2026 7:59 AM

కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చాలి

కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చాలి

ఎస్‌టీయూ నేతల డిమాండ్‌ కలెక్టరేట్‌ వద్ద ధర్నా

నరసరావుపేట ఈస్ట్‌: కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్‌టీయూ) రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.కోటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఎన్నికల మేనిఫెస్టో హామీల అమలు డిమాండ్‌ చేస్తూ ఎస్‌టీయూ ఆధ్వర్యంలో చేపట్టిన దశల వారీ ఉద్యమంలో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాలో కోటేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తన హామీల్లో భాగంగా 12వ పీఆర్సీ ఏర్పాటు చేయాలనీ, అప్పటి వరకు 30 శాతం మధ్యంతర భృతిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ధర్నాకు అధ్యక్షత వహించిన ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఎల్‌.వి.రామిరెడ్డి మాట్లాడుతూ, రూ.34 వేల కోట్లను దశల వారీగా విడుదల చేయాలని, అలాగే పెండింగ్‌లో ఉన్న 4 డీఏలను విడుదల చేయాలని కోరారు. నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.ఏమండీ మాట్లాడుతూ జిల్లాను యూనిట్‌గా తీసుకొని కారుణ్య నియాకాలను పూర్తి చేయాలన్నారు. పెన్షనర్ల నగదును ఉద్యోగ విరమణ రోజు వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయుల ధర్నాకు మద్దతు ఇచ్చిన సీపీఐ జిల్లా కార్యదర్శి మారుతీ వరప్రసాద్‌, సహాయ కార్యదర్శి కాసా రాంబాబు మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. నాలుగు విడతల డీఏ మంజూరు చేయాల్సి ఉండగా ఒక డీఏతో చేతులు దులుపుకున్నదని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు ఆందోళనలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లాను కలసి వినతి పత్రం అందచేశారు. కార్యక్రమంలో ఎస్‌టీయూ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు జె.గంగాధర్‌ బాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు యు.చంద్రజిత్‌ యాదవ్‌, వెంకట కోటయ్య, రాష్ట్ర కార్యదర్శి సి.హెచ్‌.అనిల్‌ కుమార్‌, రాష్ట్ర ఆడిట్‌ కమిటీ సభ్యుడు షేక్‌.కరిముల్లా, జిల్లా పరిధిలోని మండలాల అధ్యక్ష్య, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement