భోగభాగ్యాల దేవుడు ... దైద అమరలింగేశ్వరుడు
ఏర్పాట్లు పూర్తిచేశాం
గురజాల : పల్నాడు ప్రాంతంలోని భక్తులకు భోగభాగ్యాలిచ్చే ... అమరలింగేశ్వరుడు మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబయ్యారు. కోరిన కోర్కెలు తీర్చుతూ కొలిచిన వారి కొంగు బంగారంగా విలసిల్లుతూ ప్రాచీన చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన అమరలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం ఎంతో అనుభూతి కలుగుతుందని భక్తుల నమ్మకం. మండల పరిధిలోని దైద గ్రామ సమీపంలో కృష్ణానది తీరంలో బిలంలో కొలువై ఉన్న అమరలింగేశ్వర స్వామి దేవాలయం మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. ప్రతి సంవత్సరం ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.
ప్రత్యేక పూజలు
ప్రతి సోమవారం బిలంలో ప్రత్యేక పూజలు , అభిషేకాలు నిర్వహిస్తారు. స్వామి వారి దర్శనార్ధం వచ్చే భక్తులకు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిత్య అన్నదానం ఏర్పాట్లు చేపడతారు. శివరాత్రి వంటి ఉత్సవాల్లో భక్తులతో కోలాహలంగా ఉంటుంది. కృష్ణానదిలో స్నానమాచరించి బిలంలో కొలువై వున్న అమరలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే మనస్సులో ఉన్న కోర్కెలు వెంటనే తీరుతాయని భక్తుల విశ్వాసం.
దైదకు వెళ్లే మార్గం ఇలా...
గుంటూరు నుంచి వచ్చు వారు మాచర్ల బస్సు ఎక్కి గురజాలలో దిగాలి. గురజాల బస్టాండ్ సమీపంలో దైద బస్సులు, ఆటోలు అందుబాటులో వుంటాయి. గురజాల నుంచి సుమారుగా 18 కిలోమీటర్లు దూరంలో కృష్ణానది తీర పరీవాహక ప్రాంతంలో స్వామి వారి దేవాలయం కనిపిస్తుంది. మాచర్ల నుంచి వచ్చు వారు గుంటూరుకు వెళ్లు బస్సులు ఎక్కి గురజాలలో దిగాలి.
శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. కృష్ణానదిలో స్నానమాచరించిన మహిళలకు ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేశాం. అదే విధంగా బిలంలోకి వెళ్లే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశాం. మంచినీటి వసతి, అన్నదానం వంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. అదే విధంగా కృష్ణానదిలో భద్రతా చర్యలు చేపట్టాం.
–పూర్ణచంద్రరావు,
కార్యనిర్వహణాధికారి


