సైబర్‌ మోసం.. రూ.3.89 లక్షలు మాయం | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ మోసం.. రూ.3.89 లక్షలు మాయం

Feb 8 2026 4:05 AM | Updated on Feb 8 2026 4:05 AM

సైబర్‌ మోసం.. రూ.3.89 లక్షలు మాయం

సైబర్‌ మోసం.. రూ.3.89 లక్షలు మాయం

ఈపూరు(శావల్యాపురం): ఈపూరు మండలంలోని అంగలూరు గ్రామానికి చెందిన ఎరువుల షాపు యజమాని గణపర్తి ఉదయ్‌కుమార్‌ సైబర్‌ నేరానికి గురై రూ. 3.89లక్షలు పోగొట్టుకున్నట్లు ఎస్‌ఐ వేణుగోపాలరావు శనివారం తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు.. గణపర్తి ఉదయ్‌కుమార్‌ సెల్‌ఫోనుకు కాల్‌ రాగా కంప్యూటరు వాయిస్‌తో నేను రైతన్న మాట్లాడుతున్నాను అని చెప్పగా ఫేక్‌ కాల్‌గా గుర్తించగా రెండు సెకన్లు వ్యవధిలో కాల్‌ కట్‌ చేశాడు. తక్షణమే 8 సందేశాలు వచ్చి నగదు కట్‌ అయినట్లు గుర్తించి మోసానికి గురైనట్లు నిర్థారణ చేసుకొని సత్వరమే 1930 నంబరు ఫోను చేసి అప్రమత్తం అయినట్లు ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విలేకర్ల సమావేశంలో తెలిపారు.

నేడు పల్నాడు జిల్లా రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ ఎన్నికలు

నరసరావుపేట: ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ఏపీఆర్‌ఎస్‌ఎ) జిల్లా యూనిట్‌ నూతన కమిటీ ఎన్నికలు ఆదివారం ఆర్డీఓ కాంపౌండ్‌లోని రెవెన్యూ భవన్‌లో నిర్వహిస్తున్నామని జిల్లా యూనిట్‌ అధ్యక్షులు ఎన్‌.నాగమల్లేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూతన కమిటీ ఎన్నికలకు నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల డివిజన్లు, కలెక్టరేట్‌ యూనిట్‌కు చెందిన నాలుగు డివిజన్ల కార్యవర్గ సభ్యులు, జిల్లా బాడీ సభ్యులు హాజరుకానున్నారని తెలిపారు. ఎన్నికల అధికారులుగా నెల్లూరు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పెంచలరెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దివ్య దుర్గాదేవి వ్యవహరిస్తారన్నారు. సంబంధిత కార్యవర్గ సభ్యులు జిల్లా బాడీ సభ్యులు అందరూ తప్పనిసరిగా హాజరై, నూతన బాడీ ఎన్నికను విజయవంతం చేయాలని కోరారు.

కొనసాగిన భారత్‌ రంగ్‌ మహోత్సవ్‌

నగరంపాలెం (గుంటూరు వెస్ట్‌): నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా/ వేదిక (తెలుగు నాటక పరిషత్‌ల సంఘం) సంయుక్తంగా మార్కెట్‌ కూడలిలోని శ్రీవేంకటేశ్వర విజ్ఙాన మందిరంలో నిర్వహిస్తున్న భారత్‌ రంగ్‌ మహోత్సవ్‌– అంతర్జాతీయ నాటక ఉత్సవం శనివారం రెండో రోజుకి చేరింది. అంతరించిపోతున్న చెక్క భజన, బురక్రథను విద్యార్థులు ప్రదర్శించారు. బాల కళాకారుల ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. అనంతరం జరిగిన సభకు వేదిక అధ్యక్షుడు ముత్తవరపు సురేష్‌బాబు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఏపీ నాటక అకాడమీ చైర్మన్‌ గుమ్మడి గోపాలకృష్ణ పాల్గొని ప్రసంగించారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు, గజల్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. పోలాండ్‌ దేశం వారు ప్రదర్శించిన ఉమాదేవి అబ్‌సర్వస్స్‌ వాండా డైనోస్కా ప్రేక్షకులను భావోద్వేగాలకు గురిచేసింది. పోలాండ్‌కు చెందిన థియేటర్‌ మలబార్‌ హోటల్‌ బృందం ఈ నాటకాన్ని ఆంగ్లం–పోలిష్‌ భాషల్లో ప్రదర్శించగా, రచన, దర్శకత్వ బాధ్యతలను లికాజ్‌ చోట్‌కౌస్కి నిర్వహించారు.

ఉన్నత విద్యను విధ్వంసం చేసే బిల్లును రద్దు చేయాలి

ఏఎన్‌యూ(పెదకాకాని): రాష్ట్ర హక్కులను కాలరాస్తూ ఉన్నత విద్యను విధ్వంసం చేసే బిల్లును రద్దు చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు గండు శివ అన్నారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ సమితి పిలుపులో భాగంగా జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట వికసిత్‌ భారత్‌ శిక్షా అధిష్ఠాన్‌–2025 బిల్లును వ్యతిరేకిస్తూ ఫ్లకార్డులతో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. విద్యార్థుల హక్కులను కాలరాస్తూ, యూనివర్సిటీల అభివృద్ధి కోసం ఏర్పడిన యూజీసీ, ఏఐసీటీఈ, ఎసీటీఈలను రద్దు చేసి, వీటిని హెచ్‌ఈసీఐ పేరుతో ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ద్వారా విద్య కేంద్రీకరణకు కేంద్రం పాల్పడుతోందన్నారు. ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి యశ్వంత్‌ రఘువీర్‌లు మాట్లాడారు.

నకిలీ పురుగు మందులు గుర్తించడం కీలకం

కొరిటెపాడు(గుంటూరు): నకిలీ పురుగు మందులు గుర్తించడంలో లాబోరేటరీలు కీలకంగా పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకులు మనజీర్‌ జిలాని సుమూన్‌ కోరారు. గుంటూరులోని పురుగుమందుల పరీక్ష కేంద్రాన్ని శనివారం తనిఖీ చేశారు. పురుగుమందుల శాంపిల్స్‌ పరీక్షా విధానం, విశ్లేషణ ఫలితాలు ఇన్‌సైట్‌ యాప్‌లో నమోదు చేయడంపై ఏడీఏ సీహెచ్‌ తిరుమలాదేవి, యనలిస్ట్‌లను అడిగి తెలుసుకున్నారు. మనజీర్‌ జిలాని సుమూన్‌ మాట్లాడుతూ పురుగుమందుల శాంపిల్స్‌ను తప్పిదాలు లేకుండా పరీక్ష చేసి, నకిలీ పురుగుమందులను అరికట్టాలని సూచించారు. గుంటూరు పురుగుమందుల ల్యాబ్‌కు నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డు ఫర్‌ టెస్టింగ్‌ అండ్‌ కాలిబ్రేషన్‌ లాబొరేటరీస్‌ వచ్చేలాగా కృషి చేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement