పరమ పావనం
శిఖర దీప దర్శనం..
భువనేశ్వర్:
రాష్ట్రంలో ప్రముఖ శైవ క్షేత్రం లింగ రాజు ఆలయం మహా శివ రాత్రి సందర్భంగా భక్తుల తాకిడితో కిటకిటలాడింది. వేకువ జాము నుంచి నడి రాత్రి వరకు ఆలయ ప్రాంగణం శివ నామ స్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. జాగారం భక్తుల కోసం ఆలయ పాలక వర్గం స్థానిక నగర పాలక సంస్థ సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. లింగరాజు ఆలయం శిఖరంపై ఆకాశ దీపం దర్శనం వరకు జాగారం భక్తులు శివ నామ జపంతో అఖండ జ్యోతి ఆరాధన నిరవధికంగా కొనసాగించారు.
ముఖ్యమంత్రి సందర్శన
రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి సతీ సమేతంగా లింగ రాజు ఆలయం ప్రత్యక్షంగా సందర్శించి ఆలయ శిఖర జ్యోతి దర్శనం చేసుకున్నారు. మహా శివ రాత్రి సందర్భంగా ఆలయ శిఖర జ్యోతి దర్శనం పరమ పావనంగా ఆయన పేర్కొన్నారు.
హరి హర భేటి
భువనేశ్వర్: పవిత్ర మహా శివ రాత్రి పురస్కరించుకుని జట్నీ బల్లిఛక్ సాహి లక్ష్మీ నారాయణ ఆలయంలో హరి హర భేటీ పూజా కార్యక్రమం నిర్వహించి విభిన్నత చాటుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ఆలయాల తరహాలో అఖండ నామ జపం, ఆకాశ దీప దర్శనం, భజన తదితర కార్యక్రమాలతో హరి హర భేటి నిర్వహించి భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం మూల ఆరాధ్య దైవం లక్ష్మీనారాయణుని ఉత్సవ మూర్తిని బాజా బజంత్రీలతో ప్రాకార ప్రదక్షిణ చేపట్టి ఆలయ సముదాయంలో శివాలయంలోని మహా దేవుని సన్నిధిలో ప్రవేశ పెట్టారు. ప్రత్యేక పూజాదుల తర్వాత భక్తులకు దర్శన సౌలభ్యం కల్పించారు.
శివపార్వతుల తిరువీధి ఉత్సవం
పర్లాకిమిడి: మహాశివరాత్రి రోజైన ఆదివారం లింగోద్భవం, లింగాభరణ మహోత్సవం, మరుసటిరోజైన సోమవారం శివపార్వతులను పట్టణంలో తిరువీధి ఉత్సవం జరిపారు. రాజవీధిలో ఉమారామలింగేశ్వర ఆలయం, ఏకాంబరీశ్వర ఆలయం, ఆర్ధనారీశ్వర ఆలయ పూజార్లు పల్లకిమీద తిరువీధి ఉత్సవం జరిపి రంగులు జల్లారు. ఈ సుందర దృశ్యాలను భక్తులు మనసారా తిలకంచి పులకించిపోయారు.
పరమ పావనం
పరమ పావనం
పరమ పావనం


