పంట పొలంలో యువకుని మృతదేహం లభ్యం
రాయగడ: ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువకుడు శవమై తేలాడు. ఈ సంఘటన జిల్లాలోని శెశిఖాల్ పోలీస్‌స్టేషన్ పరిధి బాయిసింగి గ్రామ సమీపంలో చోటుచేసుకోగా.. పంటపొలంలో యువకుని మృతదేహం లభ్యమయ్యింది. మృతుడు అదే గ్రామానికి చెందిన సిద్ధాంత్ గంట (21)గా గుర్తించారు. సోమవారం ఉదయం అటువైపుగా వెళ్లిన స్థానికులు పొలంలో పడి ఉన్న మృతదేహాన్ని చూసి పంచాయతీ సర్పంచ్ క్రిష్ణ తాడింగికు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి కుటుంబీకులతో సహా సర్పంచ్ వెళ్లారు. మృతదేహం పడి ఉన్న కొద్ది దూరంలో అతని బైక్ ఉండటాన్ని గమనించారు. వెంటనే శెశిఖాల్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. శనివారం వ్యక్తిగత పనిపై సిద్ధాంత్ ఇంటి నుంచి రాయగడకుకు వాహనంపై వెళ్లారు. అయితే రాత్రి అయినప్పటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. ఇంతలోనే శవమై తేలడంతో హత్య లేక ఇంకేమైన కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పంట పొలంలో యువకుని మృతదేహం లభ్యం
పంట పొలంలో యువకుని మృతదేహం లభ్యం


