మధ్యాహ్న భోజనంలో అక్రమాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు
మల్కన్‌గిరి: జిల్లాలోని ఎం.వి.55 గ్రామంలో ఉన్న అరవింద ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బియ్యం, నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయంటూ స్థానికులు జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్‌కు శనివారం ఫిర్యాదు చేశారు. దీంతో దీనిపై తక్షణమే దర్యాప్తు చేయాలని జిల్లా విద్యాశాఖధికారిని కలెక్టర్ ఆదేశించారు. దానితో డీఈవో చిత్తరంజార్ దాస్, అదనపు విద్యాశాఖ అధికారితో కలిసి పాఠశాలను సందర్శించారు. బియ్య్‌ం, స్టాక్ రికార్డులు, ఇతర పత్రాలను పరిశీలించారు. సుమారు 42 బస్తాల మధ్యాహ్న భోజన బియ్యం పునఃప్రాసెసింగ్ కోసం ఒక మిల్లుకు పంపినట్లు బయటపడింది. అయితే జిల్లా సరఫరా అధికారి ద్వారా అందించబడే మధ్యాహ్న భోజన బియ్యం ప్రత్యేక పోషకాహారంతో కూడిన ఫోర్టిఫైడ్ రైస్ కావడంతో దాన్ని మళ్లీ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ అక్రమాలలో బాధ్యత వహించిన ప్రధానోపాధ్యాయురాలి పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆమెకు సోకాజ్ నోటీసు జారీ చేసినట్టు అధికారులు వెల్లడించారు.


