ఆకట్టుకున్న ‘విచలిత మట్టి’
జయపురం: జయపురం సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో సబ్‌డివిజన్ కుంద్ర సమితి పరిధిలోని కుంద్ర గ్రామంలో గల బిజూ పట్నాయక్ కళాశాల రజిత ఉత్సవ వేదికపై ప్రదర్శించిన ‘విచలిత మట్టి’ సామాజిక నాటకం సమాజంలో రుగ్మతలతోపాటు ఆదర్శాలను ప్రతిభింబింపచేసింది. జగదీష్ అధికారి కలం నుంచి వెలువడిన ‘విచలిత మట్టి’ నాటకానికి నిరంజన్ పాణిగ్రహి దర్శకత్వం వహించారు. జి.మహేష్, ఈశ్వర్‌సరాఫ్ సంగీతం సమకూర్చారు. నాటకంలో మహమ్మద్ షరీఫ్, సురేష్ హోత్త, పంచానన మిశ్ర, నృశింహ షొడంగి, మోహన్‌రావు, అనిల్ జెనా, సరోజ్ మిశ్ర, నిరంజన్ పాణిగ్రహి, పవిత్ర మల్లిక్, విజయలక్ష్మి పాణిగ్రహి, మనిష, ప్రీతి, ప్రతీక్ష, సాస్వతి, స్మైల్, ప్రాణిత, ఆర్యన్, నివేదన్ పాణిగ్రహి తమ పాత్రలకు జీవం పోశారు. ఈ నాటకంలో జన్మభూమిని ప్రేమించటం, మొక్కలు నాటడం వలన కలిగే ప్రయోజనాలు, మానవ జీవితంలో విద్య యొక్క ఆవస్యకతకు ప్రాధాన్యత ఇచ్చారు. మరో పక్క మద్యపానం వలన కలిగే అనర్థాలు నాటకం ద్వారా ప్రజలకు తెలియజేశారు. అవిభక్త కొరాపుట్‌లో ఆదివాసీల దుర్భర జీవణ పరిస్థితిని ప్రేక్షకుల కళ్లకు కట్టినట్లు నటులు నటించారు. గ్రామీణ ప్రాంతాల్లో నివాసులు, న్యాయవాది మధ్య జరిగిన వివాదం ఈ నాటకంలో ప్రదర్శించి ప్రేక్షకులను అలరించింది. ఈ నాటకంలో కళాకారుల నటన, నృత్య ప్రదర్శనలు చూపరుల ప్రశంసలు అందుకున్నాయి. నాటక ప్రదర్శనకు గోపాల సామంతరాయ్, లాలూ మిశ్ర, ఆర్యన్, నివేదన పాణిగ్రహి సహకరించారు.
ఆకట్టుకున్న ‘విచలిత మట్టి’


