మొసళ్లను సంరక్షించాలి
రాయగడ: మొసల్లను సంరక్షించడంతో పర్యావరణ సమతుల్యానికి ఎంతో దోహదపడుతుందని గంజాం కళాశాల అధ్యాపకులు మహేంద్ర శతపతి అన్నారు. స్థానిక అటానమస్ కళాశాల జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో బుధవారం మొసల్ల సంరక్షణ స్వర్ణోత్సవ సదస్సులో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొసల్ల సంరక్షణ కోసం చిత్తడి నేలల ఆరోగ్యానికి చాలా ముఖ్యమని అన్నారు. ఇవి జల ఆవరణ వ్వవస్థలో అగ్ర మాంసాహారులుగా పాత్ర పోషిస్తుంటాయని వివరించారు. నీటి వనరులను శుభ్రతగా ఉంచడంతోపాటు ఇతర జంతువుల జనాభాను నియంత్రించే విషయంలో కీలక పాత్ర పోషిస్తుంటాయన్నారు. వీటిని సంరక్షించడంతో ఆర్థిక లాభాలతోపాటు పర్యావరణానికి ఎంతో దోహదపడుతుంటాయన్నారు. ఈ సదస్సులో అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ సరస్వతి రాయ్, జంతుశాస్త్ర విభాగాధిపతి పూజా పట్నాయక్, డాక్టర్ రాజేష్ స్వయ్, అధ్యాపకురాలు జ్యోతి, రమేష్ హుయిక, తదితరులు పాల్గొన్నారు.


