కల్యాణం చూతము రారండి..!
● నేడు శ్రీనివాసుని కల్యాణ మహోత్సవం ● భక్తులకు ప్రవేశం ఉచితం
శ్రీకాకుళం కల్చరల్: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామివారి కల్యాణోత్సవం బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో నిర్వహించనున్నట్లు టీటీడీ కార్యాలయం సూపరింటెండెంట్ క్రాంతి కుమార్ వెల్లడించారు. నగరంలోని టీటీడీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. స్వామివారి ఆశీస్సులు భక్తుల చెంతకే చేర్చాలనే సదుద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వైభవంగా కల్యాణం జరపనున్నట్లు తెలిపారు. దీనినే లోక కల్యాణం అని పిలుస్తారని చెప్పారు. ఈ కల్యాణోత్సవం కోసం సాక్షాత్తు తిరుమల క్షేత్రం నుంచి వేద పండితులు, అర్చక స్వాములు విచ్చేస్తున్నట్లు పేర్కొన్నారు. తిరుమల ఆలయం నుంచి వచ్చే విగ్రహాలకు వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా శ్రీవారి కల్యాణం జరిపించడం ఈ కార్యక్రమం ప్రత్యేకత అన్నారు. దైవ దర్శనం కోసం తిరుమల వెళ్లలేని భక్తులకు, వారి సౌకర్యార్థం అందుబాటులోకి స్వామివారిని తీసుకొచ్చి ఆశీస్సులు అందించాలనే సంకల్పంతో కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. ఈ కల్యాణోత్సవానికి ప్రవేశం ఉచితమని, భక్తులంతా విచ్చేసి దేవదేవుని కృపాకటాక్షాలు పొందాలని ఆకాంక్షించారు. సమావేశంలో టీటీడీ కల్యాణ ప్రాజెక్టు సూపరింటెండెంట్ హరికృష్ణ, జిల్లా ప్రోగ్రాం అసిస్టెంట్ శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు.


