పూరీ సముద్ర తీరంలో నత్తల గుంపు
భువనేశ్వర్: పూరీ సముద్ర తీరంలో అసాధారణ దృశ్యం పర్యాటకులు, స్థానికుల దృష్టిని ఆకర్షిస్తోంది. లెక్కకు మిక్కిలిగా సజీవ సముద్ర నత్తలు ఇసుక ప్రాంతంలో తిరుగుతున్నట్లు కనిపించాయి. ఈ అరుదైన దృశ్యం నీలాద్రి బీచ్,
బ్లూ ఫ్లాగ్ బీచ్ వద్ద తారసపడుతుంది. పర్యాటకులు, సందర్శకులు, స్థానికుల్ని అబ్బురపరుస్తుంది. సముద్ర నత్తలు రాత్రి సమయంలో పెద్ద గుంపులుగా ఒడ్డుకు చేరుతున్నాయి. ఇసుక మీదుగా కదులుతు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. సూర్యోదయం తర్వాత ఒకటి నుండి రెండు గంటలలోపు సముద్ర గర్భం వైపు పయనమై అదృశ్యమవుతున్నాయి. సందర్శకులను ఈ దృశ్యం మంత్రముగ్ధుల్ని చేస్తోంది. పూరీ బీచ్‌లో ఇంతకు ముందు ఇలాంటి ప్రకృతి సహజమైన రమణీయ దృశ్యాలను చూడలేదని సందర్శకులు మురిసిపోతున్నారు. సాగర తీరంలో నత్తల కదలికను ప్రత్యక్షంగా తిలకించేందుకు తెల్లవారుజామున సందర్శకుల తాకిడి పెరుగుతోంది. ఇంత పెద్ద సంఖ్యలో సముద్ర నత్తలు లోతైన నీటిని వదిలి ఒడ్డుకు రావడానికి గల కచ్చితమైన కారణం అస్పష్టంగానే ఉంది. ఈ సంఘటన వాతావరణ మార్పులతో ముడిపడి ఉందా లేదా మరేదైనా సహజ పరిస్థితులతో సంభవిస్తుందా అన్నది తెలియాల్సి ఉంది. ఈ దృశ్యం బీచ్‌కి వెళ్లేవారిలో మరియు ప్రకృతి ప్రియుల్లో ఉత్సుకతను రేకెత్తిస్తుంది. సముద్ర నత్తల ప్రవర్తన, పూరీ తీరప్రాంతంలో వాటి కదలికను ప్రభావితం చేసే అంశాలను అర్థం చేసుకోవడానికి మరిన్ని అధ్యయనాలు జరగాలని మేధావుల వర్గం అభిప్రాయపడుతోంది.
పూరీ సముద్ర తీరంలో నత్తల గుంపు
పూరీ సముద్ర తీరంలో నత్తల గుంపు


