250 కొత్త అంబులెన్స్‌ల ప్రారంభం
భువనేశ్వర్: అత్యవసర ఆరోగ్య సంరక్షణ పటిష్టత కార్యాచరణలో భాగంగా కొత్తగా 250 కొత్త అంబులెన్స్‌లను ప్రవేశ పెట్టారు. స్థానిక కళింగ స్టేడియం ఆవరణలో మంగళ వారం ఏర్పాటు చేసిన 2వ విడత రాష్ట్ర అంబులెన్స్ విస్తరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ జెండా ఊపి కొత్త అంబులెన్స్‌ల సేవలను ప్రారంభించారు. సకాలంలో వైద్య సహాయం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 428 కొత్త అంబులెన్స్‌లను ఏర్పాటు చేసింది. దీని కోసం రాష్ట్ర నిధుల నుంచి దాదాపు రూ. 111 కోట్లు వెచ్చించారు. తొలి విడత కింద గత ఏడాది డిసెంబర్ 23న 150 అంబులెన్స్ సేవలు ప్రారంభించారు. అనారోగ్య పరిస్థితుల్లో అత్యవసర ప్రతిస్పందనను బలోపేతం చేసి బాధితులను సకాలంలో ఆస్పత్రులకు చేరదీయడంలో అవాంఛనీయ జాప్యం తొలగించడం లక్ష్యంగా పేర్కొన్నారు. దీని వల్ల అవాంఛనీయ మరణాల రేటును తగ్గించడం సాధ్యం అవుతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర సేవల్లో భాగంగా 866 అంబులెన్స్‌లను నడిపిస్తున్నారు. అదనంగా జనని ఎక్స్‌ప్రెస్ పథకం కింద 500 ప్రత్యేక అంబులెన్స్‌లు ప్రత్యేకంగా గర్భిణులు, అనారోగ్య పిల్లల సేవల కోసం వినియోగిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మండలాల నుంచి జిల్లా ప్రధాన కార్యాలయ ఆస్పత్రులు, కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్ కాలేజ్, హాస్పిటల్‌కు రాత్రింబవళ్లు సేవలను నిర్వహించడానికి సన్నాహాలు చురుకుగా కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో రౌర్కెలా, జైపూర్ వంటి ఎయిర్‌స్ట్రిప్‌లకు అంబులెన్స్ సేవలు త్వరలో విస్తరిస్తాయని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా విమానాశ్రయాలలో ఐదు అడ్వాన్‌న్స్‌డ్ లైఫ్ సపోర్ట్ (ఏఎల్ ) అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఝార్సుగుడలోని క్యాన్సర్ ఆస్పత్రిలో ఇలాంటి రెండు అంబులెన్స్‌లు ఉన్నాయి. ఈ సేవల ద్వారా రోజుకు సగటున 5,000 మందికి పైబడి రోగులను ప్రభుత్వ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్, ఏకామ్ర భువనేశ్వర్ నియోజక వర్గం ఎమ్మెల్యే బాబూ సింగ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ కమ్ కార్యదర్శి ఎస్.అశ్వతి, జాతీయ ఆరోగ్య మిషన్ డైరెక్టర్ డాక్టర్ డి. బృంద పాల్గొన్నారు.


