40 రోజులు.. 20 చోరీలు | - | Sakshi
Sakshi News home page

40 రోజులు.. 20 చోరీలు

Feb 10 2026 7:21 AM | Updated on Feb 10 2026 7:21 AM

40 రో

40 రోజులు.. 20 చోరీలు

మొబైల్‌ షాపుల్లోనూ..

జిల్లాలో ఆగని దొంగతనాలు

స్వైర విహారం చేస్తున్న దొంగలు

భయాందోళనలో ప్రజలు

శ్రీకాకుళం క్రైమ్‌ : ఏడాది ప్రారంభమై నలభై రోజులవుతోంది. అప్పుడే జిల్లాలో 20 చోరీలు జరిగాయి. అటు ఇచ్ఛాపురం నుంచి ఇటు జేఆర్‌పురం వరకు దొంగలు వీర విహారం చేస్తున్నారు. ఇది అంతర్రాష్ట్ర ముఠా పనేనన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. తాళం వేసిన ఇళ్లు, ఒంటరి మహి ళలు, వృద్ధులే కాక బంగారు దుకాణాలు, దేవాలయాలు, బ్యాంకులే వీరి లక్ష్యంగా కనిపిస్తోంది.

అంతర్రాష్ట్ర ముఠా పనేనా..?

గత ఏడాది జిల్లాలో దాదాపు 398 చోరీలు జరగగా రూ.3.82 కోట్ల సొత్తు పోయింది. చోరీలు అధిక శాతం చేసింది అంతర్రాష్ట్ర ముఠాల సభ్యులే. 57.5 శాతం ఉన్నది వారే. దుప్పట్లు, బూరలు, ప్లాస్టిక్‌ బొమ్మలు, ఎలక్ట్రికల్‌ వస్తువులైన హోంథియేటర్లు అమ్మడమే కాక పాడైపోయిన టీవీలు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్‌ మెషీన్లు, ఫర్నిచర్లు కొంటామన్న నెపంతో ఊరూరా తిరిగి రెక్కీ చేయడమే వీరి పని. తర్వాత వరుస చోరీలు చేసి చెక్కేస్తారు. 2026లో దాదాపు 20 చోరీలు ఇప్పటికే జరిగాయి. గత మూడు రోజుల్లోనే నాలుగు చోరీలు జరిగాయి.

దేవాలయాల్లో..

● గత నెల 9న కాశీబుగ్గ చిన్నతిరుపతి ఆలయంలో ఆరున్నర తులాల బంగారం, 15 కిలోల వెండి రూ. 80 వేలు నగదు చోరీతో పాటు సీసీకెమెరాలు డీవీఆర్‌ చెరువులో పడేశారు.

● అదే రోజు కొత్తూరు మండలం పారాపురం సత్యసాయిబాబా గుడిలో 28 కిలోల వెండి పాదుకలు చోరీకి గురయ్యాయి.

● దీనికి ముందురోజే నరసన్నపేట సత్యవరం పాదాలమ్మ తల్లిగుడి, దూకుల పాడులోని జ్యోతి రామలింగేశ్వరస్వామి గుడిలో దొంగతనాలు జరిగాయి.

వరుస దొంగతనాలు

● సోమవారం జిల్లాకేంద్రంలోని పీఎన్‌కాలనీ 2వ లైన్‌లో రిటైర్డ్‌ నేవీ ఉద్యోగి ఏవీ మూర్తి ఇంటిలో 4 తులాలకు పైగా బంగారం చోరీకి గురైంది.

● ఈ నెల 7న మందస మండలం బాలిగాంలో వరుస ఇళ్లల్లో దొంగలు చోరీకి పాల్పడి దాదాపు ఒకటిన్నర తులాల బంగారం, ఆరు తులాల వెండి కాజేశారు.

● అదే రోజు పలాస బత్తుల వీధిలో ఓ వృద్ధురాలికి మత్తు మందిచ్చి రూ. 2.50 లక్షల నగదు, పావు తులం బంగారం పట్టుకుపోయారు.

● అదే రోజు రోటరీ నగర్‌కు చెందిన సునీతా పాత్రో ఇంట్లోని బీరువాలో 5 తులాల బంగారం చోరీకి గురైంది.

ఇళ్లకు వచ్చి మరీ

● గత నెల 5న ఆమదాలవలస చంద్రయ్యపేటలో మహిళను ఓ అగంతకుడు కత్తితో బెదిరించి రెండున్నర తులాల తాడు పట్టుకుపోయాడు.

● గత నెల 20న సారవకోట మండలం బద్రిగ్రామంలో పట్టపగలే మహిళ కాళ్లుచేతులు కట్టి 3 తులాల బంగారం చోరీ చేశారు.

● గతనెల 17న వజ్రపుకొత్తూరు మండలం పూండి–గోవిందపురంలో పంచాయతీ కార్యదర్శి శరత్‌చంద్రదొర ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి 75 తులాల వెండి, ఐదున్నరతులాల బంగారం, రూ. 90 వేలు నగదు చోరీ చేశారు.

● ఇదే పూండిలో ఓ బంగారం దుకాణంలో 18 తులాల బంగారు ఆభరణాలను మధ్యప్రదేశ్‌కు చెందిన ముఠా దోచుకుపోయింది.

● గత నెల 7న ఫాజుల్‌బేగ్‌పేటకు చెందిన గౌరీదేవి ఇంట్లో 2 తులాల బంగారం, రూ. 40 వేలు నగదు చోరీకి గురైంది.

● 10న ఇచ్ఛాపురం అప్పన్నపేటలో రామారావు ఇంట్లో తులంన్నర బంగారం చోరీకి గురయ్యాయి.

టెక్కలి రూరల్‌: టెక్కలి పరిధిలోని పలు మొబైల్‌ షాపుల్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి ప్రయత్నిస్తుండటంతో యజమానులు భయాందోళనకు గురవుతున్నారు. సోమ వారం వేకువజామున స్థానిక అంబేడ్కర్‌ జంక్షన్‌ సమీపంలో ఉన్న గణేష్‌ మొబైల్‌ షాపులో సోమవారం వేకువ జామున దొంగతనానికి ప్రయత్నించగా యజమాని ఒక్కసారిగా కేకలు వేయడంతో పారిపోయాడు. ఈ నెల 5న కూడా ఓ చోరీ ప్రయత్నం జరిగింది. వస్తువులు చోరీకి గురి కాకపోవడంతో పోలీసులకు చెప్పలేదు. కానీ యజమానుల్లో మాత్రం భయం మెదులుతోంది.

40 రోజులు.. 20 చోరీలు 1
1/2

40 రోజులు.. 20 చోరీలు

40 రోజులు.. 20 చోరీలు 2
2/2

40 రోజులు.. 20 చోరీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement