వైభవంగా హనుమద్వాహనసేవ
● రేపటితో ముగియనున్న
బ్రహ్మోత్సవాలు
రాయగడ: అమలాభట్ట సమీపంలోని శ్రీక్షేత్ర టౌన్ షిప్ ప్రాంగణంలో కొలువైయున్న శ్రీనృసింహ స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవంలో భాగంగా బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం రాత్రి స్వామి వారికి హనుమద్వాహన సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణలతో హనుమంతుని భుజంపై ఆశీనుడైన స్వామి వారిని ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఈ ప్రధాన ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ధర్మకర్త దూడల శ్రీనివాస్, ట్రస్టు సభ్యులు స్వామి వారి సేవలో నిమగ్నమయ్యారు. హనుమద్వాహన పల్లకిని మోసుకుంటూ స్వామి వారికి జయజయ ధ్వనాలతొ ఊరేగింపు నిర్వహించారు. ముందుగా మహిళలు కొలాటం, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి వాహనం మోసుకుంటూ మందిరం వద్దకు తీసుకువెళ్లారు. అనంతరం స్వామి వారిని ఆశీనుడైన సమయంలో సహస్ర దీపాలంకరణ సేవలో భాగంగా దీపాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భాగంగా మహిళలు దీపాలను వెలిగించారు. పద్మం పువ్వు ఆకారంలో దీపాలను ఉంచి స్వామి వారికి సమర్పించారు. తదుపరి నిత్యహోమాలతో పాటు నీరాజనం, మంత్రపుష్పములతో పూజా కార్యక్రమాలు జరిగాయి. కాగా మంగళవారంతో బ్రహ్మోత్సవాలు ముగిస్తాయని నిర్వహకులు తెలిపారు.
వైభవంగా హనుమద్వాహనసేవ
వైభవంగా హనుమద్వాహనసేవ
వైభవంగా హనుమద్వాహనసేవ


