వర్సిటీ విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ ఆందోళన
జయపురం: విక్రమదేవ్ విశ్వవిద్యాలయ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకులు శనివారం ఆందోళన చేపట్టారు. పరీక్ష ఫలితాలు ఆలస్యంగా విడుదల చేయటం, హాస్టళ్లలో తగిన వసతులు, సౌకర్యాలు లేకపోవడం, స్కాలర్‌షిప్ మంజూరులో జాప్యంపై పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని రిజిస్ట్రార్ మహేశ్వర్ చంద్ర నాయిక్‌కు ఏబీవీపీ ప్రతినిధులు అందజేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు అధిక ప్రాధాన్యతనిస్తామని రిజిస్ట్రార్ హామీ ఇచ్చారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. విశ్వవిద్యాలయలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించటం తమకు ముఖ్యమని.. అందుకు ఒక కమిటీ వేసి పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. డిమాండ్లను పరిశీలించి వాటిని విడతల వారీగా అమలు చేస్తామని చెప్పారు. విద్యార్థుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని, సమస్యల పరిష్కారంలో తాము ఎటువంటి జాప్యం చేయమని హామీ ఇచ్చారు. విశ్వవిద్యాలయ అభివృద్ధి, ప్రశాంతత విద్యార్థుల సహకారంతోనే సాధ్యమన్నారు. రిజిస్ట్రార్ హామీతో విద్యార్థులు ఆందోళన విరమించారు.
వర్సిటీ విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ ఆందోళన


