బిహార్ రాజ‌కీయాల్లో మ‌రో ఆస‌క్తిక‌ర‌ ప‌రిణామం | Why Nitish Kumar son Nishant Kumar declined Bihar deputy CM post | Sakshi
Sakshi News home page

డిప్యూటీ సీఎం ప‌ద‌వి వ‌దిలేశారు!

Apr 16 2026 8:29 PM | Updated on Apr 16 2026 9:17 PM

Why Nitish Kumar son Nishant Kumar declined Bihar deputy CM post

అధికారం కోసం రాజ‌కీయ నేత‌ల వార‌సులు ఎగ‌బ‌డుతున్న ప్ర‌స్తుత రోజుల్లో బిహార్ మాజీ సీఎం నితీశ్ కుమార్‌ త‌న‌యుడు నిశాంత్ భిన్నంగా వ్య‌వ‌హ‌రించారు. డిప్యూటీ సీఎం అయ్యే అవ‌కాశం వ‌చ్చినా కాద‌నుకున్నారు. ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని పొందిన త‌ర్వాతే ప‌ద‌వి చేప‌ట్టాల‌ని, అప్ప‌టి వ‌ర‌కు జ‌నం మ‌ధ్య ఉండేందుకే ఆయ‌న మొగ్గుచూపారు.  

బిహార్‌లో తొలి బీజేపీ ముఖ్య‌మంత్రిగా స‌మ్రాట్ చౌద‌రి బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డంతో  ఆ రాష్ట్ర రాజ‌కీయాలు (Bihar Politics) మ‌రో మ‌లుపు తిరిగాయి. నితీశ్ కుమార్ సీఎం ప‌ద‌విని వ‌దిలిపెట్టి హ‌స్తిన బాట ప‌ట్ట‌డంతో కాషాయ‌పార్టీకి తొలిసారి బిహార్ ముఖ్య‌మంత్రి పీఠం ద‌క్కింది. అయితే నితీశ్ ఢిల్లీకి వెళ్తూ త‌న కొడుకు నిశాంత్ కుమార్‌ను బిహార్ కేబినెట్‌లోకి ప్ర‌వేశ‌పెడ‌తార‌న్న వార్త‌లు షికారు చేశాయి. జేడీ(యూ) సీనియర్ నాయకులు విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర యాదవ్‌లు బుధవారం సమ్రాట్ చౌదరితో కలిసి ప్రమాణ స్వీకారం చేయ‌డంతో ఈ ఊహాగానాల‌కు తెర‌ప‌డిపోయింది. నితీశ్ వార‌సుడిగా కాకుండా త‌ను తానుగా ప‌ద‌వి సంపాదించుకోవాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని జేడీ(యూ) పార్టీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

పార్టీకే ప‌రిమిత‌మ‌వుతా
ఉప ముఖ్యమంత్రి ప‌ద‌వి చేప‌ట్టాల‌ని నిశాంత్ కుమార్‌ను ఒప్పించేందుకు పార్టీ నాయ‌కులు తీవ్రంగా ప్ర‌య‌త్నించారు. అయితే తాను డిప్యూటీ సీఎం కావ‌డానికి ఇంకా స‌మ‌యం ఉంద‌ని పార్టీ నేత‌ల‌కు ఆయ‌న చెప్పారు. కొంత‌కాలం పార్టీకే ప‌రిమిత‌మ‌వుతాన‌ని స్పష్టంచేశారు. ఉప ముఖ్యమంత్రి ప‌ద‌వి చేప‌ట్టాల‌ని నిశాంత్‌ను కోరుతూ మంగ‌ళ‌వారం అర్ధరాత్రి వరకు పార్టీ నాయ‌కులు చ‌ర్చ‌లు జ‌రిపారు. కానీ ఆయ‌న స‌సేమీరా అన్నారు. డిప్యూటీ సీఎం ప‌ద‌వి చేప‌ట్టేందుకు అవసరమైన అనుభవం తనకు ఇంకా రాలేదంటూ ఈ ప్ర‌తిపాద‌న‌ను సున్నితంగా తిర‌స్క‌రించారు.

త‌న భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించడానికి పార్టీ కార్యకర్తలు, ప్రజలతో ఎక్కువ సమయం గడపాల‌ని అనుకుంటున్నారు. కేత్ర‌స్థాయిలో ప‌నిచేయ‌డం ద్వారా అనుభ‌వం గ‌డించాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఈ అనుభ‌వం ప్రభుత్వాన్ని ఎలా నడపాలో అర్థం చేసుకోవడానికి దోహ‌ద‌ప‌డుతుంద‌ని నిశాంత్ న‌మ్ముతున్నారు. అయితే నితీశ్‌ కుమార్ వారసత్వాన్ని సజీవంగా ఉంచడానికి నిశాంత్‌.. డిప్యూటీ సీఎం అయితే బాగుండేద‌ని పార్టీలోని ఒక వర్గం భావిస్తోందని జేడీ(యూ) సీనియర్ నాయకుడు ఒక‌రు అన్నారు.

ఆరు నెల‌ల త‌ర్వాతే ప‌ద‌వి!
ఆరు నెలల పాటు తాను ఏ పదవినీ స్వీక‌రించే అవ‌కాశం లేదని నిశాంత్ స్ప‌ష్టం చేసిన‌ట్టు తెలుస్తోంది. 44 ఏళ్ల నిశాంత్ కుమార్ గత నెలలో అధికారికంగా జేడీ(యూ)లో చేరారు. ఆయ‌న పార్టీలో చేరే సమయంలో ఆయన తండ్రి నితీశ్‌ కుమార్ అక్కడ లేక‌పోవ‌డం అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నితీశ్‌, నిశాంత్ ఎల్లప్పుడూ వార‌స‌త్వ రాజకీయాలను వ్యతిరేకించారని, అందుకే నిశాంత్ ప్రజల  నమ్మకాన్ని సంపాదించుకున్నాకే ప‌ద‌వి చేప‌ట్టాల‌ని కోరుకుంటున్నారని పార్టీ నాయకుడొక‌రు అన్నారు. "తన తండ్రి రాజ్యసభకు వెళ్లాల‌ని నిర్ణయించుకున్న తర్వాతే నిశాంత్ బిహార్ రాజకీయాల్లోకి వచ్చారు. నితీశ్ కుమార్ ఇప్పుడు ఢిల్లీకి మారినందున, పార్టీని బలోపేతం చేయడంపై నిశాంత్ కుమార్ దృష్టి పెట్టాలనుకుంటున్నారు" అని వివ‌రించారు.

చ‌ద‌వండి: కేర‌ళ ఎన్నిక‌ల్లో జ‌రుగుతోంది ఇదే!

నిశాంత్ నెగ్గుకొస్తారా?
నితీశ్ కుమార్ హ‌స్తిన బాట ప‌ట్ట‌డంతో బిహార్‌లో జేడీ(యూ) భ‌విష్య‌త్తు మ‌న్ముందు ఎలా ఉండ‌బోతోందో ఊహించ‌డం క‌ష్ట‌మ‌ని రాజ‌కీయ‌ విశ్లేష‌కులు అంటున్నారు. బీజేపీ వ్యూహాల‌ను త‌ట్టుకుని పార్టీని కాపాడుకోవ‌డం క‌త్తి మీద సామేనేన‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. బిహార్ కేబినెట్‌లో నిశాంత్ చేరితేనే బాగుండేద‌ని పేర్కొంటున్నారు. ఆరు నెల‌లు అనుభ‌వం గ‌డించిన త‌ర్వాత ప‌ద‌వి తీసుకుంటాన‌ని చెప్ప‌డం ఇప్ప‌టి రాజ‌కీయాల‌కు సూటుకాదంటున్నారు. ఎందుకంటే 6 నెల‌ల త‌ర్వాత ప‌రిస్థితుల‌ను ఎవ‌రూ ఊహించ‌లేరని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో నిశాంత్ ఎలా నెగ్గుకొస్తార‌నేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement