ఆ రూ.3 వేలు తీసుకోకపోయి ఉంటే.. 26 మంది ప్రాణాలు నిలబడేవి | Two Kashmiri locals arrested in connection with Pahalgam Incident | Sakshi
Sakshi News home page

ఆ రూ.3 వేలు తీసుకోకపోయి ఉంటే.. 26 మంది ప్రాణాలు నిలబడేవి

Apr 22 2026 4:23 PM | Updated on Apr 22 2026 5:15 PM

Two Kashmiri locals arrested in connection with Pahalgam Incident

ఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడి జరిగి నేటికి ఏడాది. ఈ సందర్భంగా ఆ మారణహోమానికి సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఎన్‌ఐఏ విచారణలో తేలిన వివరాల ప్రకారం పహల్గాం ఉగ్రదాడి ముందు రోజు (ఏప్రిల్‌ 21, 2025 రాత్రి) ముగ్గురు పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు ఇద్దరు కాశ్మీర్‌ స్థానికులు ఫర్వేజ్‌ అహ్మద్‌, బషీర్‌ అహ్మద్‌  ఆశ్రయం కల్పించారు. ఉగ్రవాదుల గురించి పోలీసులకు సమాచారం ఇచ్చే   అవకాశమున్నప్పటికీ, వారు చెప్పలేదు. ఇందుకోసం ఉగ్రవాదుల నుంచి రూ.3,000 తీసుకున్నట్లు విచారణలో బయటపడింది.

ఆ రాత్రి ఫైజల్‌ జాట్‌ అలియాస్‌ సులేమాన్‌ షాక్‌, హబీబ్‌ తాహీర్‌ అలియాస్‌ జిబ్రాన్‌, హంజ్జా ఆఫ్గానీ అనే ముగ్గురు ఉగ్రవాదులు ఆయుధాలతో ఆ ఇద్దరి ఇళ్లకు వచ్చారు. వారు ఉర్దూ, పంజాబీ భాషల్లో మాట్లాడుతుండగా, పెద్ద దాడి జరగబోతుందనే విషయం స్థానికులకు అర్థమైంది. సుమారు ఐదు గంటల పాటు అక్కడే గడిపి, భోజనం చేసి, అవసరమైన వంట పాత్రలు, బ్లాంకెట్‌, టార్పాలిన్‌ షీట్‌ తీసుకెళ్లారు.

ఏప్రిల్‌ 22న మధ్యాహ్నం 12:30 వరకు ఫర్వేజ్‌, బషీర్‌ ఇళ్ల వద్దే ఉన్న ఉగ్రవాదులు ఆ తర్వాత బైసరీన్‌ వ్యాలీలో దాక్కున్నారు. అదే రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో ఫర్వేజ్‌, బషీర్‌ పహల్గాంలో టూరిస్టులను గుర్రాలపై బైసరీన్‌ వ్యాలీకి తీసుకెళ్లారు. అక్కడే మారణహోమం జరిగింది. దాడి జరుగుతున్నా తమకేం పట్టనట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయారని ఎన్‌ఐఏ విచారణలో తేలింది. జూన్‌ 22, 2025న ఎన్‌ఐఏ ఆ ఇద్దరు స్థానికులను అదుపులోకి తీసుకుని, ఛార్జ్‌షీట్‌లో వారి పేర్లను చేర్చింది.

ఫర్వేజ్‌, బషీర్‌ తీసుకున్న ఆ మూడు వేల రూపాయలే 26 మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఘటన జరిగి ఏడాది గడిచినా, బాధితుల కళ్ల ముందు ఆ దృశ్యాలు ఇంకా కదలాడుతూనే ఉన్నాయని, వారు కన్నీటి పర్యంతమవుతున్నారని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement