అమ్మో.. ఆ రోజు నేను చూసింది అదే! | Ponywallah Recounts Pahalgam Horror A Year After Terror Attack | Sakshi
Sakshi News home page

ఆ రోజు నేను చూసింది.. ఎవ‌రూ చూడ‌కూడ‌ద‌ని ప్రార్థిస్తున్నా!

Apr 20 2026 8:26 PM | Updated on Apr 20 2026 8:29 PM

Ponywallah Recounts Pahalgam Horror A Year After Terror Attack

ప‌ర్యాట‌కురాలిని సుర‌క్షిత ప్రాంతానికి తీసుకెళుతున్న జ‌వాను (ఫైల్‌)

పహల్గామ్ ఘ‌ట‌న‌పై గుర్రపు బగ్గీ కార్మికుడు

"ఆ రోజు నేను చూసిన దారుణ‌ దృశ్యాన్ని మరెవరూ జీవితంలో అలాంటిది చూడకూడదని ప్రార్థిస్తున్నాను" అని అబ్దుల్ వహీద్ వానీ అన్నారు. పహల్గామ్‌లో స‌మీపంలోని బైసార‌న్ ప‌ట్ట‌ణంలో ఏడాది క్రితం ముష్క‌ర మూక సాగించిన రాక్ష‌స ప‌ర్వాన్ని గుర్తు చేసుకుని ఆయ‌న ఈ మాట‌లు అన్నారు. క‌శ్మీర్‌లోని పహల్గామ్‌లో అతిపెద్ద గుర్రపు బగ్గీ కార్మికుల సంఘాలలో ఒకదానికి వహీద్ అధ్యక్షుడిగా ఉన్నారు. పహల్గామ్ దాడి జ‌రిగి ఏడాది పూర్త‌వుతున్న త‌రుణంలో ఆనాటి బాధాక‌ర‌ విష‌యాల‌ను టైమ్స్ ఆఫ్ ఇండియాతో పంచుకున్నారు.

అది 2025, ఏప్రిల్ 22.. మధ్యాహ్నం స‌మ‌యం. బైసారన్‌లో ఏదో అవాంఛనీయ సంఘటన జరిగిందని అబ్దుల్ వహీద్ వానీకి పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. అక్క‌డికి స‌మీపంలోనే ఉన్న ఆయ‌న త‌న‌కు బాగా తెలిసిన అడ్డ‌దారిలో పోలీసుల కంటే ముందే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నాడు. “నేను అక్కడికి చేరుకునేట‌ప్ప‌టికి.. ఒక మహిళ ఏడుస్తూ, ఒక చిన్నారి ఏడుస్తూ కనిపించారు. మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

ఇదంతా చూశాక ఒక్క క్షణం నేను తిరిగి వెళ్ల‌నేమో అనిపించింది. వెంట‌నే తేరుకుని సమీపంలోని దుకాణం వద్దకు పరుగెత్తి నీళ్ల సీసా తీసుకుని ఆమె వద్దకు తిరిగి వచ్చాను. వాట‌ర్ బాటిల్ ఆమె అందించి.. పోలీసులు, అధికారులు వ‌స్తున్నార‌ని ధైర్యం చెప్పాను. ఆ తర్వాత వెంటనే  సుమారు 700 మంది గుర్రపు బగ్గీ కార్మికులు ఉన్న ఒక వాట్సాప్ గ్రూప్‌లో స‌హాయం కోసం మెసేజ్ పెట్టాను. సంఘ‌ట‌నా స్థ‌లానికి వ‌చ్చి సాయం చేయాల‌ని కోరారు. అయితే, భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించడంతో సుమారు 15 మంది మాత్రమే సంఘటనా స్థలానికి చేరుకోగలిగారు. గాయపడిన వారికి సహాయం చేయడానికి మేము శాయ‌శ‌క్తులా ప్రయత్నించాం.

బైసారన్ చాలా పెద్ద ప్రాంతం, మృతదేహాలు అక్కడక్కడా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వాటన్నింటినీ ఒకచోట చేర్చడానికి సమయం పట్టింది. మృతుల్లో ఎక్కువ మందికి త‌ల‌కు బుల్లెట్ గాయాలున్నాయి. ఘ‌ట‌నా స్థలాన్ని వ‌దిలి రావ‌డానికి ఓ మ‌హిళ నిరాక‌రించింది. త‌న భ‌ర్త అక్క‌డే ఉన్నార‌ని, తామిద్దరం ఇప్పుడే నడుస్తూ ఫోటోలు తీసుకుంటున్నామ‌ని, తాను ఒంటరిగా ఎక్కడికి వెళ్లాలంటూ ఆమె రోదించింది. మృతదేహాల మధ్య ప్రాణాలతో పడి ఉన్న మ‌రో వ్యక్తిని మేము గుర్తించాం. మేము అతడిని తాకినప్పుడు, అతను మాట్లాడాడు. అతని మెడ, చేతిపై బుల్లెట్ గాయాలు ఉన్నాయి. ఏం జరిగిందో అతడు మాతో చెప్పాడు.

పరిమిత వనరులు ఉన్నప్పటికీ, స్థానికుల స‌హాయంతో గాయపడిన వారిలో కొందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగాం. ఒక వ్యక్తిని మేము భుజాలపై, ఆ తర్వాత మంచంపై మోసుకెళ్లాం. అతడు ప్రాణాలతో బయటపడ్డాడని అబ్దుల్ వహీద్ వానీ చెప్పారు. ఆ రోజు తాను చూసిన దృశ్యాలు ఇప్ప‌టికీ క‌ళ్ల‌ముందే మెదులుతున్నాయ‌ని, మ‌ర‌పున‌కు రావ‌డం లేద‌న్నారు. ఇలాంటి దారుణ‌ విషాద దృశ్యాలను మరెవరూ చూడకూడదని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఈ చీక‌టి జ్ఞాప‌కాలు త‌ర‌చుగా గుర్తుకు వ‌స్తుంటాయ‌ని తెలిపారు. “ఆ జ్ఞాపకాలు తిరిగి వచ్చినప్పుడల్లా నన్ను నేను ఏదో ఒక పనిలో నిమగ్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. అటూ ఇటూ తిరుగుతాను, చేయడానికి ఏదైనా పని వెతుక్కుంటాను లేదా ఎవరికైనా ఫోన్ చేస్తాను” అని అబ్దుల్ వహీద్ వానీ వెల్ల‌డించారు.

చ‌ద‌వండి: అందుకే మ‌హిళా బిల్లును ఓడించామ‌న్న రాహుల్ గాంధీ

కాగా, గతేడాది ఏప్రిల్ 22న బైసారన్‌లో ప‌ర్యాట‌కుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఉగ్ర‌వాదులు జ‌రిపిన దాడుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో స్థానిక గుర్ర‌పు బ‌గ్గీ కార్మికుడు కూడా ఉన్నాడు. న‌వ‌వ‌ధువు క‌ళ్లెదుట ఆమె భ‌ర్త‌ను అతి దారుణంగా కాల్చిచంప‌డం జాతి యావ‌త్తును దిగ్భ్రాంతికి గురిచేసింది. పహల్గామ్ దాడిపై కేంద్ర ప్ర‌భుత్వం తీవ్రంగా స్పందించి పాకిస్తాన్‌తో అన్ని సంబంధాలు తెంచుకుంది. ఆప‌రేష‌న్ సిందూర్ పేరుతో దాయాది దేశంలోని ఉగ్ర‌తండాల‌ను నేల‌మ‌ట్టం చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement