
భోపాల్: మధ్యప్రదేశ్ హోం మినిస్టర్ నరోత్తం మిశ్రాకు చేదు అనుభవం ఎదురయ్యింది. వరదల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు వెళ్లిన నరోత్తం.. చివరకు తానే వరదలో చిక్కుకుపోయాడు. విషయం తెలిసిన వెంటనే అధికారులు హెలికాప్టర్‌ని రంగంలోకి దించి.. తాడు సాయంతో ఆయనను పైకి లాగి రక్షించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
కుండపోత వర్షాల కారణంగా మధ్యప్రదేశ్ దాతియా జిల్లాలో భారీగా వరదలు సంభవించాయి. ఈ క్రమంలో జిల్లాలోని కోట్రా గ్రామంలో ప్రజలు వరదలో చిక్కుకుని ఇబ్బందులు పడసాగారు. ఈ క్రమంలో వరద తీవ్రత పెరగడంతో కొందరు గ్రామస్తులు ఇంటి మీదకు చేరి సాయం కోసం ఎదురు చూస్తున్నారని తెలిసింది. వారికి సాయం చేసేందుకు హోం మినిస్టర్ నరోత్తం మిశ్రా.. కొందరు సహాయక సిబ్బందితో కలిసి పడవలో కోట్రా గ్రామానికి బయల్దేరారు. ఇంతలో ఉన్నటుండి ఓ చెట్టు పడవ మీద పడటంతో అది అక్కడే చిక్కుకుపోయింది.. ముందుకు కదలేదు.
పరిస్థితి గురించి నరోత్తాం మిశ్రా ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్‌ని రంగంలోకి దింపారు. తాళ్ల సాయంతో ఆయనను పైకి లాగారు. అనంతరం వరదల్లో చిక్కుకున్న మరో తొమ్మిది మంది గ్రామస్తులను కూడా కాపాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.