Maratha reservation: మరాఠాల ఆందోళన హింసాత్మకం

Maratha reservation agitation: Maratha quota agitation turns violent in Maharashtra - Sakshi

ఎన్‌సీపీ ఎమ్మెల్యేల ఇళ్లపై నిరసనకారుల దాడి

బీజేపీ ఎమ్మెల్యే ఆఫీస్‌లో విధ్వంసం

ముంబై: మహారాష్ట్రలో ప్రత్యేక కోటా డిమాండ్‌తో మరాఠాలు చేపట్టిన ఆందోళన మళ్లీ హింసాత్మక రూపం దాల్చింది. ఆందోళనకారులు సోమవారం బీడ్‌ జిల్లా మజల్‌గావ్‌లోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌సీపీ) ఎమ్మెల్యేలు ప్రకాశ్‌ సోలంకె, సందీప్‌ క్షీరసాగర్‌ ఇళ్లకు నిప్పు పెట్టారు. మజల్‌గావ్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ భవనంలోని మొదటి అంతస్తులో ఫర్నిచర్‌కు నిప్పుపెట్టి, విధ్వంసం సృష్టించారు. ఛత్రపతి శంభాజీ జిల్లా గంగాపూర్‌లో నిరసనకారులు బీజేపీ ఎమ్మెల్యే ప్రశాంత్‌ బంబ్‌ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు.

కిటికీలు, ఫర్నిచర్‌ పగులగొట్టారు. పలు చోట్ల రహదారులపై బైటాయించారు. మరాఠాలకు ప్రత్యేక కోటా డిమాండ్‌కు మద్దతుగా సీఎం ఏక్‌నాథ్‌ షిండే వర్గానికి చెందిన నాశిక్, హింగోలి ఎంపీలు హేమంత్‌ గాడ్సే, హేమంత్‌ పాటిల్‌లు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘మరాఠాలకు రిజర్వేషన్లు అక్టోబర్‌ 24 నుంచి అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రభుత్వానికి 40 రోజుల డెడ్‌లైన్‌ పెట్టిన వారు ఈ వ్యవహారం చిన్న పిల్లల ఆట అనుకుంటున్నారు’అంటూ ఎమ్మెల్యే సోలంకె చేసిన వ్యాఖ్యల ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

మరాఠాలకు రిజర్వేషన్ల డిమాండ్‌తో మనోజ్‌ జరంగె అనే వ్యక్తి అక్టోబర్‌ 25 నుంచి జల్నా జిల్లాలోని అంతర్వలి సరటి గ్రామంలో నిరశన దీక్షకు సాగిస్తున్నారు. దీనిపై ఎమ్మెల్యే సోలంకె..కనీసం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా పోటీ చేయని వ్యక్తి, ఇప్పుడు నాయకుడా..అంటూ వ్యాఖ్యానిస్తున్నట్లుగా ఆ ఆడియోలో ఉంది. దీంతో మరాఠా సంఘాలు భగ్గుమన్నాయి. సోమవారం స్థానికంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. కొందరు ఆందోళనకారులు సోమవారం మధ్యాహ్నం మజల్‌గావ్‌లోని ఎమ్మెల్యే ఇంటిని చుట్టుముట్టారు. ఆయన నివాసానికి, కారుకు నిప్పుపెట్టారు, రాళ్లు రువ్వారు.

ఘటన సమయంలో ఆ ఇంట్లోనే ఉన్నట్లు ఎమ్మెల్యే సోలంకె ఆ తర్వాత తెలిపారు.  బీడ్‌ నగరంలో మరో ఎన్‌సీపీ ఎమ్మెల్యే సందీప్‌ క్షీరసాగర్‌ నివాసం, ఆఫీసుకు కూడా నిప్పు పెట్టారు. పోలీసులు అక్కడికి చేరుకున్న గుంపును చెదరగొట్టారు. బీడ్‌లోని ఒక హోటల్‌కు మరాఠా నిరసనకారులు అగ్నికి ఆహుతి చేశారు. జల్నా వద్ద ముంబైకి వెళ్లే సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌ వేపై బైటాయించారు.

షోలాపూర్‌–అక్కల్‌కోట్‌ హైవేపై మండుతున్న టైర్లను వేసి వాహనాలను అడ్డుకున్నారు.  కొందరు నిరసనకారులు కర్రలు పట్టుకుని గంగాపూర్‌లోని ఎమ్మెల్యే ప్రశాంత్‌ కార్యాలయంపై దాడి చేశారు. యావత్మాల్‌లో తనను ఆందోళనకారులు అడ్డగించి, రిజర్వేషన్‌ అంశంపై నిలదీశారని హింగోలి ఎంపీ హేమంత్‌ పాటిల్‌ తెలిపారు. దీంతో, రాజీనామా పత్రం రాశానన్నారు. తన రాజీనామా లేఖ అందినట్లు లోక్‌సభ సెక్రటేరియట్‌ నుంచి రసీదు వచ్చిందని చెప్పారు. రిజర్వేషన్లపై వైఖరి తెలపాలంటూ నాశిక్‌ ఎంపీ గాడ్సేను కొందరు నిలదీయడంతో ఆయన  రాజీనామా చేసి లేఖను సీఎంకు పంపించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top