యువతపై సెకండ్‌ వేవ్‌ పంజా, కారణం ఏంటో చెప్పిన ఐసీఎంఆర్‌

Icmr Tell Why Youth Affected Covid-19 In 2nd Wave - Sakshi

యువతపై కరోనా సెకండ్‌ వేవ్‌ పంజా

మొదటి వేవ్‌ కంటే సెకండ్‌ వేవ్‌ లో ఎక్కువ కేసులు 

హెచ్చరిస్తున్న ఐసీఎంఆర్‌  

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ ప్రభావం కొనసాగుతోంది. మొదటి వేవ్‌ కంటే సెకండ్‌ వేవ్‌లో కరోనా ప్రభావం వల్ల పెద్ద సంఖ్యలో యువత ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో ఐసీఎంఆర్‌ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ మాట్లాడుతూ.. దేశంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. సెకండ్‌ వేవ్‌లో ఎక్కువ మంది యువత దాని బారిన పడుతున్నారు. అందుకు కారణం యువత నిర్లక్ష్యంగా ఉండడమే. కోవిడ్‌ నిబంధనల్ని పాటించాలని ప్రభుత్వాలు చెబుతున్నా పట్టించుకోకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరగడం, పబ్లిక్‌ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో యువత పెద్ద సంఖ్యలో గుమిగూడడం ఓ కారణమని తెలిపారు.  

అయితే కొవిడ్‌ -19 మొదటి వేవ్‌, రెండో వేవ్‌ కేసుల్ని పరీక్షించగా పెద్దగా వయస్సు వ్యత్యాసం లేదన‍్నారు. 40 ఏళ్లు పైబడిన వారిపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పారు.  అయితే 2020లో మొదటి వేవ్‌లో 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు 31 శాతం మంది ఉన్నారు. 2021లో ఈ శాతం 32కి చేరుకుందని కేంద్రం మార్చిలో తెలిపింది. కాగా, కర్నాటక, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో రోజువారీ కొత్త కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టగా.. మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, చత్తీస్‌ గఢ్‌, బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణతో పాటు 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ వెల్లడించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top