వద్దన్నా.. వినకుండా ఈవెంట్‌ బృందంతో వెళ్లి..

Four Vizag People Died In Car Accident Odisha - Sakshi

భువనేశ్వర్‌/ఆరిలోవ/బీచ్‌రోడ్డు(విశాఖపట్నం): ఓ వివాహ వేడుక నిర్వహణకు బయల్దేరిన ఈవెంట్‌ బృందంపై మృత్యువు పంజా విసిరింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురి ప్రాణాలను అనంతలోకాలకు తీసుకుపోయింది. గురువారం వేకువజామున ఒడిశా రాష్ట్రంలో 16వ నంబర్‌ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఈ దుర్ఘటన సంభవించింది. ఈ ప్రమాదంలో విశాఖకు చెందిన ఇద్దరు మహిళలు సహా నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

జంకియా స్టేషన్‌ పోలీసులు తెలిపిన వివరాలివీ.. ఖుర్దా జిల్లా బొడొ పొఖొరియా గ్రామం వద్ద యూ టర్న్‌ తీసుకోబోయిన లారీ సాంకేతిక లోపంతో జాతీయ రహదారిపై మొరాయించింది. ఇంతలో వెనుక నుంచి దూసుకు వస్తున్న పెళ్లి ఈవెంట్‌ బృందం కారు.. ఆగి ఉన్న లారీని ఢీకొని నుజ్జయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గురువారం వేకువజామున 4 గంటల సమయంలో పొగమంచు దట్టంగా కప్పి ఉండడంతో ఎదురుగా ఉన్న వాహనం కనిపించకపోవడంతోనే ఈ దుర్ఘటన సంభవించినట్లు సమాచారం.

ఇందులో ఇద్దరు మహిళలు సహా నలుగురు మృతి చెందారు. జంకియా స్టేషన్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను ఖుర్దా జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. మృతులు బి.లక్ష్మి (34), ఈవెంట్‌ మేనేజర్‌ మరియా ఖాన్‌(26), అహ్మది హిక్మతుల్లా(28), రాకేష్‌కుమార్‌ అలియాస్‌ రాఖీ(34)గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయడంతో పాటు బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 

వద్దన్నా.. వినకుండా  
ఇంట్లో వద్దన్నా పట్టించుకోకుండా ఈవెంట్‌ కవరేజీ కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయిందని బి.లక్ష్మి కుటుంబ సభ్యులు వాపోయారు. పెళ్లి కోసం వెళ్లాల్సిన బృందంలో ముందుగా మాట్లాడుకున్న.. బ్యూటీషియన్‌ రాకపోవడంతో లక్ష్మిని హుటాహుటిన బయల్దేరించారని తెలిపారు. దూర ప్రాంతం వెళ్లొద్దని నివారించినా.. పూరీలో పెళ్లితో పాటు జగన్నాథుడిని దర్శించుకుని తిరిగి వచ్చేస్తానని ఇంటి నుంచి వెళ్లి, తిరిగిరాని లోకాలకు తరలిపోయిందని విలపించారు.

విశాలాక్షినగర్‌లో విషాదచాయలు 
ఒడిశాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రాకేష్‌కుమార్‌ అలియాస్‌ రాఖీ(34)ది జీవీఎంసీ 9వ వార్డు పరిధి విశాలాక్షినగర్‌. ఈ విషయం తెలుసుకున్న తల్లి మీనాకుమారి, అక్క రాధికాదేవి కన్నీటి పర్యంతమవుతున్నారు. రాకేష్‌కుమార్‌ అయ్యప్ప స్వామి మాల ధరించారు. బుధవారం రాత్రి ఇంటి వద్ద స్వామి పూజ చేసుకుని నగరంలో మరో ముగ్గురితో కలసి పెళ్లి వేడుక కవర్‌ చేయడానికి రాత్రి 8.30 గంటలు సమయంలో కారులో ఒడిశా బయలుదేరారు.

రాకేష్‌ ఫొటోగ్రాఫర్‌/కెమెరామన్‌. అలాగే హైదరాబాద్‌లోని హెచ్‌ఎస్‌బీసీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. వర్క్‌ ఫ్రమ్‌ హోం కావడంతో విశాలాక్షినగర్‌లో ఇంటి వద్దే ఉంటూ ఖాళీ సమయంలో ఈవెంట్లకు వెళ్తుంటాడు. ఈ క్రమంలో రాకేష్‌ రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. రాకేష్‌ తల్లితో కలసి విశాలాక్షినగర్‌లో ఉంటుండగా.. అతని అక్క, బావ సీతమ్మధారలో నివాసముంటున్నారు. మారియా ఖాన్‌ ఆర్‌.కె బీచ్‌ సమీపంలోని పాండురంగాపురంలో బ్యూటీపార్లర్‌ నిర్వహిస్తున్నారు. అహ్మది హిక్మతుల్లా(కబీర్‌) ఆఫ్గాన్‌ పౌరుడు కాగా ఎంవీపీకాలనీ సెక్టార్‌–2లోనూ, బి.లక్ష్మి రాజేంద్రనగర్‌లో నివాస ముంటున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top