ఎయిరిండియా విమాన ప్రమాద మృతులకు నివాళులు
పెద్ద సంఖ్యలో తరలివచ్చిన బాధిత కుటుంబాలు
అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన దుర్ఘటన చోటుచేసుకుని అప్పుడే ఏడాదైంది. ఎయిరిండియా విమానం కుప్పకూలిన స్థలానికి శుక్రవారం బాధితుల స్నేహితులు, కుటుంబీకులు, ఆత్మీయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఘటనాస్థలిలో ప్రార్థనలు చేశారు. పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. బీజే మెడికల్ కాలేజీ ప్రాంగణంలో జూనియర్ డాక్టర్లు 260 మొక్కలు నాటారు. రక్తదాన శిబిరం నిర్వహించారు.
కాలేజీ హాస్టల్ వద్ద కొవ్వొత్తులు వెలిగించి, నివాళులర్పించారు. గతేడాది జూన్ 12వ తేదీన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి లండన్‌కు టేకాఫ్ తీసుకున్న ఎయిరిండియా విమానం కొద్దిక్షణాల్లోనే బీజే కాలేజీ సమీపంలో కుప్పకూలగా 260 మంది చనిపోయారు. ఇందులో 52 మంది యూకే పౌరులున్నారు. మెడికల్ కాలేజీ హాస్టల్‌పై పడటంతో అందులోని నలుగురు వైద్య విద్యార్థులు కూడా చనిపోయారు. శుక్రవారం జరిగిన నివాళి కార్యక్రమానికి యూకే హైకమిషనర్ లిండా కామెరాన్ కూడా హాజరయ్యారు. ఘటనాస్థలిలో పుష్పగుచ్ఛాలుంచి, మౌనం పాటించారు. హాస్టల్ భవనం వద్దే భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
కుమారుడికి మెసేజీలు పంపుతూనే ఉన్నారు..
విమాన ప్రమాదంలో సిబ్బంది అంతా ప్రాణాలు కోల్పోయారు. కానీ, క్యాబిన్ క్రూలో ఒకరి కుటుంబం మాత్రం తమ కుమారుడి సెల్‌ఫోన్‌ను రీఛార్జి చేస్తూ, ఆ కనెక్షన్‌ను యాక్టివ్‌గా ఉంచుతోంది. అంతులేని తీవ్ర దుఃఖంలోనూ అతని జ్ఞాపకాలను గుండెల్లో దాచుకుంటూ అతనికి వాట్సాప్ సందేశాలు పంపిస్తూ ఉంది. క్యాబిన్ క్రూలో భాగంగా ఉన్న పుణేకు చెందిన 22 ఏళ్ల ఇర్ఫాన్ షేక్ ప్రమాదం బలయ్యాడు. అతడి తండ్రి సమీర్..‘ప్రమాదం జరిగి ఏడాది గడిచింది. మేం ఇప్పటికీ మా కుమారుడి ఫోన్ వాట్సాప్‌కు మెసేజీలు పంపుతూనే ఉన్నాము, మా రోజువారీ విషయాలను అతనికి చెబుతుంటాము.
ఈ రోజు కూడా అతని మొబైల్‌ను రీఛార్జి చేశాము. ఆ సందేశాలన్నీ అతనికి చేరుతున్నాయనే భావిస్తున్నాము’అని షేక్ కన్నీరుమున్నీరవుతూ, తన కుటుంబ సభ్యులు ఇర్ఫాన్ మొబైల్‌కు పంపిన మెసేజ్‌లను చూపిస్తూ చెప్పారు. తన కొడుకు శరీరం పూర్తిగా కాలి బూడిదైపోయిందనే నిజాన్ని తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని సమీర్ షేక్ అన్నారు. ‘మృతదేహాలన్నీ కాలిపోయాయని మాకు చెప్పారు. కానీ, మేం పోస్ట్‌మార్టం గదికి వెళ్లినప్పుడు, అతని వస్తువులు ఉన్న ఒక బాక్స్‌ను మాకు అందించారు. అతని బట్టలు... షర్ట్, ప్యాంట్, బెల్ట్, సాక్స్ మరియు లోదుస్తులు ఏవీ కాలలేదు. అయినప్పటికీ, అతని పోస్ట్‌మార్టం నివేదికలో మాత్రం శరీరం కాలిపోయిందని ఉంది’అంటూ ఆయన ఆవేదనతో తెలిపారు.
న్యాయం జరగాలి
‘నాకు న్యాయం జరగాలి. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నా కుమార్తెకు న్యాయం దక్కాలి. ఆమె డబ్బంతా దానం చేస్తా’అని సవితా బెన్ తెలిపారు. ఈమె కుమార్తె, అల్లుడు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. ప్రమాద సమయంలో అటుగా తన వాహనంపై వస్తున్న గుజరాతీ సినీ నిర్మాత మహేశ్ జిరావాలా(34) కూడా ఈ ఘటనకు బలయ్యారు. టీకొట్టు నడిపే తన తల్లికి భోజనం ఇచ్చేందుకు వచ్చిన 14 ఏళ్ల ఆకాశ్ పట్ని కూడా విమాన శకలం తగిలి ప్రాణాలు కోల్పోయాడు. తన కుమారుడు, ఇతర మృతుల జ్ఞాపకార్థం ఆలయంలో సుందరకాండ, హనుమాన్ చాలీసా పఠనం చేపట్టినట్లు ఆకాశ్ తండ్రి సురేశ్ భాయ్ పట్ని తెలిపారు. కొడుకు మృత్యువాతపడటాన్ని ఆకాశ్ తల్లి సీతాబెన్ ఇప్పటికీ జీరి్ణంచుకోలేకపోతున్నారు. ఘటన స్థలిలో కుమారుడి ఫొటోకు పూలదండ వేసి, కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈమెకు నలుగురు సంతానం. ఆకాశ్ పెద్ద వాడు. మిగతా ముగ్గురూ కూతుళ్లు.
వివరాలను వెల్లడించాలి..
2025 జూన్ 12వ తేదీన లండన్‌కు టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే ఎయిరిండియా విమానం కుప్పకూలింది. అహ్మదాబాద్‌లోని మెఘానీనగర్ ప్రాంతంలో ఉన్న మెడికల్ కాలేజీ హాస్టల్ లోపలికి దూసుకుపోయింది. ఘటనలో ఒక్కరు మినహా విమానంలోని 242 మందితోపాటు ఆ ప్రాంతంలో ఉన్న మరో 19 మంది ప్రాణాలు కోల్పోవడం తెల్సిందే. భారత్, యూకేల్లోని విమాన బాధితులైన 130కి పైగా కుటుంబాల తరఫున అమెరికాకు చెందిన లాయర్ ఒకరు కోర్టులో కేసు వేశారు. విమాన సాంకేతిక వివరాలను వెల్లడించాలని, న్యాయం కోసం పోరాడుతున్న బాధితులకు అండగా నిలవాలని భారత్, యూకేలను ఆయన కోరుతున్నారు. ఏప్రిల్‌లో బాధిత కుటుంబాలకు చెందిన 30 మంది ప్రధాని మోదీకి లేఖ రాశారు. కాక్‌పిట్ వాయిస్ రికార్డు, బ్లాక్ బాక్స్ డేటాను విడుదల చేయడం ద్వారా నిజాన్ని వెల్లడించాలని కోరారు.


